Tourists Van Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న వ్యాన్ ఘాట్ రోడ్డులో బోల్తాపడిన సంఘటన తమిళనాడు పర్యాటక ప్రాంతం వాల్‌పారైలో సంభవించింది. 12 మంది పర్యాటకులతో వెళ్తున్న వ్యాన్ నియంత్రణ కోల్పోయి ఘాట్ రోడ్డులో బోల్తాపడటంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల సమాచారం ప్రకారం.. కేరళకు చెందిన పలువురు తమిళనాడు వాల్‌పారైకి పర్యాటకు వెళ్తున్నారు. సమీపంలో ఘాట్ రోడ్డుకు సమీపంలో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన 8 మంది మరణించగా మరో నలుగు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. మృతులంత కేరళలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అలాగే ఘటన స్థలానికి అటవీ శాఖ సిబ్బంది కూడా చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, వారికి మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వ్యాన్ పూర్తి ధ్వంసం అవ్వడంతో మృతదేహాలు వ్యాన్ శిథిలాల మధ్య ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్ల సాయంతో వెలికితీశారు. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో కేరళలో విషాద ఛాయలు అలముకున్నాయి. పర్యాటకానికి వెళ్లిన విగత జీవుల్లా తిరిగి వస్తుండటంతో బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలపడంతో పాటు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

