Central Government Employee Salary:భారత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భత్యాలు పెన్షన్లపై ప్రభావం చూపే 8వ కేంద్ర పే కమిషన్ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. ఈ కమిషన్ పనిని ప్రారంభించే దిశగా కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఉద్యోగులు పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాలు సహా సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
అవసరాలు సమస్యలు, సూచనలను..
ఈ సూచనలను స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా ఆసక్తి ఉన్నవారు తమ అభిప్రాయాలను సమర్పించవచ్చు. 2026 ఏప్రిల్ 30 వరకు ఈ సూచనలను పంపేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగులు పెన్షనర్లు, సంఘాలు తమ అవసరాలు సమస్యలు, సూచనలను ఇందులో నమోదు చేయవచ్చు.
కొత్త కమిషన్ సిఫార్సుల ద్వారా…
ప్రస్తుతం అమలులో ఉన్న 7వ కేంద్ర పే కమిషన్ గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. అందువల్ల కొత్త పే కమిషన్ ద్వారా జీతాల నిర్మాణంలో మార్పులు రావచ్చని భావిస్తున్నారు. కొత్త కమిషన్ సిఫార్సుల ద్వారా వేతనాలు డియర్‌నెస్ అలవెన్స్ ఇతర భత్యాలు, పెన్షన్ వ్యవస్థలో మార్పులు జరిగే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
8వ పే కమిషన్‌కు సంబంధించిన…
కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న 8వ పే కమిషన్‌కు సంబంధించిన నిబంధనలను అధికారికంగా ప్రకటించింది. ఈ కమిషన్ తన అధ్యయనం పూర్తి చేసి నివేదికను సమర్పించేందుకు సుమారు 18 నెలల సమయం ఇవ్వడం జరిగింది. కమిషన్ వివిధ అంశాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఆ తరువాత ప్రభుత్వం ఆ సిఫార్సులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు …
ఈ కమిషన్ అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. అంచనాల ప్రకారం దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల పెన్షనర్లు ఈ మార్పుల ద్వారా లాభపడే అవకాశం ఉంది. వేతన నిర్మాణంలో మార్పులు జరిగితే ఉద్యోగుల ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చని భావిస్తున్నారు.
భారతదేశంలో పే కమిషన్ వ్యవస్థకు చాలా కాలం చరిత్ర ఉంది. స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సమీక్షించేందుకు మొదటి పే కమిషన్ 1946లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కనీస జీతం కేవలం 55 రూపాయలుగా నిర్ణయించారు. కాలక్రమేణా వివిధ పే కమిషన్లు ఏర్పడి ఉద్యోగుల జీతాలను పెంచుతూ వచ్చాయి.
రెండో పే కమిషన్ సమయంలో కనీస జీతం 80 రూపాయలుగా నిర్ణయించారు. మూడో పే కమిషన్ అమల్లోకి వచ్చినప్పుడు అది 196 రూపాయలకు పెరిగింది. నాలుగో పే కమిషన్ అమలులో కనీస జీతం 750 రూపాయలుగా నిర్ణయించారు.
తర్వాతి సంవత్సరాల్లో వేతనాల్లో మరింత పెరుగుదల కనిపించింది. ఐదో పే కమిషన్ అమలులో కనీస జీతం 2550 రూపాయలుగా నిర్ణయించారు. ఆ తర్వాత వచ్చిన ఆరో పే కమిషన్ ద్వారా కనీస జీతం 7000 రూపాయలుగా పెరిగింది. 2016లో అమల్లోకి వచ్చిన ఏడో పే కమిషన్ ద్వారా కనీస ప్రాథమిక జీతం 18000 రూపాయలుగా నిర్ణయించారు. అదే సమయంలో గరిష్ఠ ప్రాథమిక జీతం 2.5 లక్షల రూపాయలుగా నిర్ణయించారు.
Also Read:https://teluguprabha.net/national-news/cbse-class-12-maths-exam-qr-code-opens-youtube-song/
ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా..
ఇప్పుడు 8వ పే కమిషన్ ఏర్పాటుతో మరోసారి ఉద్యోగుల జీతాలపై చర్చ ప్రారంభమైంది. కొంతమంది ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా నిర్ణయిస్తే కనీస ప్రాథమిక జీతం సుమారు 46000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించలేదు.
కొత్త వేతన నిర్మాణం అమల్లోకి…
కమిషన్ తన నివేదికను సమర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ సిఫార్సులను పరిశీలిస్తుంది. అవసరమైన మార్పులు చేసి ఆమోదం ఇచ్చిన తర్వాతే కొత్త వేతన నిర్మాణం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ పే కమిషన్ తుది నిర్ణయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

