El Nino impact on Indian Monsoon 2026 : నింగి వంక చూసే కళ్లు.. వాన చినుకు కోసం తపించే ప్రాణాలు.. మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే రుతుపవనాలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గతేడాది వరుణుడి కటాక్షంతో మురిసిన రైతన్నకు, ఈ ఏడాది ‘ఎల్ నినో’ రూపంలో ఒక గండం పొంచి ఉందన్న వార్త కలవరపెడుతోంది.
పసిఫిక్ వేడి.. రుతుపవనాలపై దాడి : భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం. మహాపాత్ర శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో దేశ వాతావరణ గమనంపై కీలక విశ్లేషణ చేశారు.
ప్రస్తుత పరిస్థితి – ఎన్సో న్యూట్రల్ : ప్రస్తుతానికి సముద్ర మట్టం వద్ద ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి. జూలై నెల వరకు ఇదే ‘న్యూట్రల్’ స్థితి కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అంటే రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయానికి పెద్దగా ముప్పు లేనట్లే. కానీ, అసలు ముప్పు ఆ తర్వాతే మొదలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
జూలై తర్వాతే అసలు పరీక్ష: “జూలై తర్వాత వాతావరణ పరిస్థితులు ఎల్ నినో వైపు మళ్లే అవకాశం ఉంది” అని మహాపాత్ర పేర్కొన్నారు. ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం. ఇలా జరిగితే, భారత్‌కు వచ్చే నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయి. తద్వారా వర్షాలు తగ్గి, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే, దీనిపై పూర్తి స్పష్టత ఏప్రిల్ నెలలో మాత్రమే వస్తుందని ఆయన తేల్చి చెప్పారు.
స్కైమెట్ ‘కరువు’ హెచ్చరిక: ఐఎండీ కొంత జాగ్రత్తగా మాట్లాడుతుంటే, ప్రైవేట్ వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాథమిక క్లైమేట్ మోడల్స్ ప్రకారం 2026లో ఎల్ నినో ప్రభావం బలంగా ఉంటుందని, ఫలితంగా దేశంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదై, కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ హెచ్చరికలు వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి.
ముందస్తు జాగ్రత్తలు: ఆహార భద్రతపై ప్రభావం : రుతుపవనాలు కుంటుపడితే దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఇది కేవలం రైతుల సమస్య మాత్రమే కాదు, ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి నడ్డి విరిచే అవకాశం ఉంది. “కంచే చేను మేసిన చందంగా” వాతావరణ మార్పులే మన ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటాయా అన్న చర్చ మొదలైంది. ఏప్రిల్ నెలలో వెలువడే ఐఎండీ తుది నివేదిక కోసం ఇప్పుడు దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

