El Nino impact on Indian monsoon 2026 : ఆకాశం వైపు ఆశగా చూసే అన్నదాత కళ్లల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు ప్రాణదానం చేయాల్సిన నైరుతి రుతుపవనాలకు అడ్డంకిగా ‘ఎల్ నినో’ (El Nino) మళ్లీ పడగ విప్పింది. పసిఫిక్ మహాసముద్రంలో రగులుతున్న వేడి.. భారతీయ రైతాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం ఈ ఏడాది వానాకాలంలో ఎల్ నినో మరింత బలపడనుందని స్పష్టమవుతోంది.
సముద్రం వేడెక్కింది.. ఎల్ నినో మొదలైంది : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జూన్ 2026 ఎన్సో (ENSO), ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) బులెటిన్‌లో సంచలన విషయాలు వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ తూర్పు, మధ్య ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయి. వాతావరణ మార్పును కొలిచే ‘నినో 3.4 ఇండెక్స్’ మూడు నెలల సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే +0.5°C దాటి నమోదైంది. ఇది ఎల్ నినో రాకకు ప్రబలమైన సంకేతం. వాతావరణ శాస్త్ర నిబంధనల ప్రకారం.. నీటి పైపొరల్లోనే కాకుండా, లోపలి పొరల్లో కూడా ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. ‘మాన్‌సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్’ (MMCFS) అంచనా ప్రకారం.. రాబోయే నెలల్లో సముద్ర గర్భంలో ఉన్న ఈ వేడి నీరు పైకి తన్నుకువచ్చి, నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్ నినోను మరింత ఉగ్రరూపానికి చేర్చనుంది.
భారత్‌పై తీవ్ర ప్రభావం.. రుతుపవనాలకు బ్రేక్? : ఎల్ నినో అంటే స్పానిష్ భాషలో ‘చిన్న పిల్లాడు’ అని అర్థం. కానీ ఇది చేసే విధ్వంసం మాత్రం పెనుభూతమే. మన దేశ చరిత్రను గమనిస్తే.. 2002, 2009, 2015, 2023 సంవత్సరాల్లో ఎల్ నినో వాతావరణాన్ని అతలాకుతలం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో తలెత్తే ఈ ఒత్తిడి మార్పుల వల్ల భారతదేశం వైపు రావాల్సిన వర్షపు మేఘాలు దారి మళ్లుతాయి. ఫలితంగా నైరుతి రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడతాయి. వర్షాలు ముఖం చాటేసి, కరవు కోరలు చాచుతుంది.
కనీసం హిందూ మహాసముద్రంలోని ‘ఇండియన్ ఓషన్ డైపోల్’ (IOD) సానుకూలంగా (Positive IOD) ఉంటే ఈ నష్టాన్ని కాస్తో కూస్తో తగ్గించవచ్చు. కానీ, ఐఎండీ స్పష్టం చేసిన ప్రకారం ప్రస్తుతం ఐఓడీ సాధారణ (Neutral) స్థితిలో ఉంది. అందువల్ల ఎల్ నినో ప్రభావాన్ని అడ్డుకునే ఆయుధం ప్రస్తుతానికి ప్రకృతి వద్ద లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం.. 2027లో రికార్డు స్థాయి వేడి : ఈ ఎల్ నినో ప్రభావం కేవలం భారత్‌కే పరిమితం కాదు. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల్లో తీవ్ర కరవు పరిస్థితులు, అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతాయి. అదే సమయంలో అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో భయానక వరదలు ముంచెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగం కుదేలై, పంటల దిగుబడి పడిపోతుంది. ఫలితంగా ఆహార ధరలు చుక్కలను తాకుతాయి. సప్లై చైన్ దెబ్బతిని, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలకు లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
మానవుడు స్వయంగా సృష్టిస్తున్న గ్లోబల్ వార్మింగ్ వినాశనానికి, ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే ఈ ఎల్ నినో కూడా తోడైతే పరిస్థితులు అదుపు తప్పుతాయని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఈ డబుల్ ఎఫెక్ట్ దెబ్బకి రాబోయే 2027వ సంవత్సరం.. చరిత్రలోనే అత్యంత వేడి (Hottest Year) సంవత్సరంగా రికార్డులకెక్కడం ఖాయమని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

