Saturday, November 15, 2025
Homeనేషనల్Dairy Farm Success: "పాలే ప్రాణం" రెండు గేదెలతో మొదలై.. రోజుకు లక్ష సంపాదిస్తున్న వృద్ధ...

Dairy Farm Success: “పాలే ప్రాణం” రెండు గేదెలతో మొదలై.. రోజుకు లక్ష సంపాదిస్తున్న వృద్ధ జంట!

Dairy farming success story : వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు మహారాష్ట్రకు చెందిన ఓ వృద్ధ దంపతులు. 50 ఏళ్ల క్రితం రెండు గేదెలతో ప్రారంభించిన వారి పాల వ్యాపారం, నేడు రోజుకు లక్ష రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తలపై పాల కుండతో వీధి వీధి తిరిగిన ఆ బామ్మ, నేడు వేలాది మందికి నాణ్యమైన పాలను అందిస్తోంది. అసలు రెండు గేదెలతో మొదలైన వారి ప్రస్థానం, లక్షల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి ఎలా చేరింది..? వారి 50 ఏళ్ల కఠోర శ్రమ వెనుక ఉన్న రహస్యమేంటి..?

- Advertisement -

నిజాయితీ, నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు.. ఈ మూడింటిని నమ్ముకుంటే ఏ వ్యాపారంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చనడానికి నాందేడ్‌కు చెందిన చంద్రకళాబాయి (78), ప్రభు అప్పా దంపతుల జీవితమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అర శతాబ్దం క్రితం, అంటే 1985లో కేవలం రెండు గేదెలతో మొదలుపెట్టిన వారి పాల వ్యాపారం, నేడు ‘ప్రభు దూద్ డెయిరీ’ పేరుతో జిల్లా వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. కేవలం వ్యాపారంలోనే కాదు, వారి సేవా స్ఫూర్తి, నిజాయితీతో ప్రజల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసుకున్నారు.

ఒకప్పటి కష్టం.. నేటి విజయం: తొలినాళ్లలో చంద్రకళాబాయి తలపై పాల కుండ పెట్టుకుని, ఇంటింటికీ వెళ్లి పాలు, పెరుగు అమ్మేవారు. ఆమె భర్త ప్రభు అప్పా, తన సైకిల్‌పై పశువుల దాణాతో పాటు ఇతర పాల పదార్థాలను విక్రయించేవారు. వారి వ్యాపారంలో నిజాయితీ ప్రధాన సూత్రంగా ఉండేది. పశువుల దాణా అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం, కల్తీ లేని స్వచ్ఛమైన పాలను వినియోగదారులకు అందించడంతో అనతికాలంలోనే కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నారు. అలా వ్యాపారం క్రమంగా వృద్ధి చెందడంతో, మరిన్ని గేదెలను కొనుగోలు చేశారు.

ఎనిమిది పదుల వయసులోనూ అదే ఉత్సాహం: నేడు వారి వ్యాపార బాధ్యతలను నాలుగో తరం చూసుకుంటున్నా, 78 ఏళ్ల చంద్రకళాబాయి ఇప్పటికీ అదే అంకితభావంతో డెయిరీ పనుల్లో నిమగ్నమై ఉంటారు. 50 ఏళ్ల క్రితం రెండుగా ఉన్న గేదెల సంఖ్య, నేడు 70కి పైగా చేరింది. ముర్రా, జాఫర్, పంధర్‌పురి వంటి మేలు జాతి గేదెలు వారి ఫామ్‌లో ఉన్నాయి. ఈ వయసులోనూ ఆమె స్వయంగా గేదెలను చూసుకోవడం, పాలు పితకడం, పెరుగు తయారుచేయడం వంటి పనుల్లో పాలుపంచుకుంటూ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

రోజుకు లక్ష రూపాయల ఆదాయం..
పాల అమ్మకం: వారి 9 ఎకరాల ఫామ్‌లోని గేదెలు రోజుకు సుమారు 500 లీటర్ల పాలను ఇస్తాయి. లీటరు పాలను రూ. 70 చొప్పున అమ్మగా, కేవలం పాల ద్వారానే రోజుకు రూ. 35,000 ఆదాయం వస్తుంది.

ఇతర ఉత్పత్తులు: పన్నీర్‌ను కిలో రూ. 360 చొప్పున, కోవాను కిలో రూ. 280 చొప్పున విక్రయిస్తారు. రోజుకు రెండు క్వింటాళ్ల కోవా అమ్ముడవుతుంది.

మొత్తం ఆదాయం: ఇలా పాలు, పన్నీర్, కోవా, నెయ్యి, ఇతర స్వీట్లు, స్నాక్స్ అమ్మకాల ద్వారా చంద్రకళాబాయి డెయిరీ ఫామ్ రోజుకు సుమారు లక్ష రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
ఒకప్పుడు పూట గడవడమే కష్టంగా ఉన్న వీరి జీవితం, నేడు నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి చేరిందంటే, దానికి కారణం వారి అకుంఠిత దీక్ష, నిజాయితీతో కూడిన శ్రమ మాత్రమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad