Election commission clarifies on congress mp Rahul Gandhi allegations of vote chori: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఓట్ చోరీ అంశాన్ని లేవనెత్తారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిగ్గింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. రాహుల్ గాంధీ ఆరోపణలు పూర్తి అవాస్తవమని తేల్చి చెప్పింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అప్పీళ్లు దాఖలు చేయలేదని ఈసీ స్పష్టం చేసింది. రాహుల్‌కు ఏవైనా సందేహాలుంటే, హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఫిర్యాదు చేయకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో 22 ఎన్నికల పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేసింది. నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితాలో లేదా ఎన్నికల్లో వ్యత్యాసం ఉందని ఏ పార్టీ అభ్యర్థి అయినా విశ్వసిస్తే అప్పీల్ దాఖలు చేయవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క అప్పీల్ కూడా దాఖలు చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం, ఎన్నికల ఫలితాలతో ఒక అభ్యర్థికి సమస్య ఉంటే, వారు హైకోర్టును ఆశ్రయించవచ్చు. హర్యానా ఎన్నికలకు సంబంధించిన ఇరవై రెండు అప్పీళ్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఒకవేళ, ఓట్ చేరి జరిగి ఉంటే.. పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్లు ఏమి చేస్తున్నారని ప్రశ్నించింది. ఒక ఓటరు ఇప్పటికే ఓటు వేసి ఉంటే లేదా పోలింగ్ ఏజెంట్‌కు ఓటరు గుర్తింపుపై సందేహాలు ఉంటే, వారు అభ్యంతరం దాఖలు చేసి ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నకిలీ ఓటర్ల సమస్యపై కూడా ఎన్నికల సంఘం స్పందించింది.” ఒకే వ్యక్తిపై ఒకటికి మించి బహుళ పేర్లను నివారించడానికి సవరణ సమయంలో కాంగ్రెస్ బీఎల్‌ఏ ఎందుకు ఎటువంటి అభ్యంతరాలను లేవనెత్తలేదు? వీరు నకిలీ ఓటర్లు అయినప్పటికీ, వారు బీజేపీకి ఓటు వేశారని ఎలా చెప్పగలం?” అని ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది.
రాహుల్ హైడ్రోజన్ బాంబు ఎప్పుడూ పేలదు..
ఇదిలావుంటే, రాహుల్ ఆరోపణలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. తన సొంత వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఆయన హైడ్రోజన్ బాంబు ఎప్పుడూ పేలదు.. రాహుల్ గాంధీ అర్ధంలేని మాటలు మాట్లాడతారు. రాహుల్ ఇలాంటి ఆరోపణల ద్వారా ఓటర్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత సెషన్‌లో రాహుల్ ఒక మహిళ పేరును తన టీ-షర్టుపై ముద్రించుకుని తిరిగారని, ఆ తర్వాత ఆమె అతన్ని విపరీతంగా తిట్టిందని కిరణ్ రిజిజు గుర్తు చేశారు. బీహార్‌లో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి తాను హర్యానా గురించి కథలు వింటున్నానని ఆయన అన్నారు. బీహార్‌లో ఏమీ మిగలకపోవడంతో, హర్యానా గురించి ఫేక్ ప్రచారం చేస్తూ బీహార్ ఓటర్ల దృష్టిని మళ్లిస్తున్నారని కిరణ్ రిజిజు ధ్వజమెత్తారు.


