Election Commission delists political parties : కేవలం కాగితాలకే పరిమితమై, ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కుతున్న ‘డమ్మీ’ రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఉక్కుపాదం మోపింది. దేశ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా, ఏకంగా 474 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను తమ జాబితా నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఈసీ ఇంతటి కఠిన చర్యలు ఎందుకు తీసుకుంది..? ఏయే పార్టీలపై ఈ వేటు పడింది..?
అసలేం జరిగిందంటే : ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం, ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీలు కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అయితే, అనేక పార్టీలు వీటిని ఉల్లంఘిస్తున్నట్లు ఈసీ గుర్తించింది.
ఎన్నికలకు దూరం: గత ఆరేళ్లుగా (2019 నుంచి) ఒక్క లోక్‌సభ, అసెంబ్లీ లేదా ఉప ఎన్నికలో కూడా పోటీ చేయని పార్టీలపై ఈసీ వేటు వేసింది.
కార్యాలయాలు లేవు: పేరుకు పార్టీలు ఉన్నా, వాటికి కనీసం భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు కూడా లేవని ఈసీ తన తనిఖీల్లో గుర్తించింది.
ఖర్చుల లెక్కలు చెప్పనివి: ఎన్నికల్లో పోటీ చేసినా, ఎన్నికల ఖర్చుల వివరాలను, వార్షిక ఆడిట్ ఖాతాలను సమర్పించని 359 పార్టీలను కూడా ఈ జాబితాలో చేర్చింది.
రెండు నెలల్లో 808 పార్టీలు రద్దు : ఈసీ తన ప్రక్షాళన కార్యక్రమాన్ని గత రెండు నెలలుగా ముమ్మరం చేసింది. ఇటీవలే 334 పార్టీలను రద్దు చేయగా, ఇప్పుడు తాజాగా మరో 474 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. దీంతో, గత రెండు నెలల్లోనే మొత్తం 808 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను ఈసీ రద్దు చేసినట్లయింది. ఈ చర్యలతో, దేశంలో గుర్తింపు లేని పార్టీల సంఖ్య 2,520 నుంచి 2,046కు తగ్గింది.
బిహార్ ఎన్నికల వేళ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లోనే 14 పార్టీలు తమ గుర్తింపును కోల్పోవడం గమనార్హం. గుర్తింపు రద్దు కావడంతో, ఈ పార్టీలు ఇకపై ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టలేవు.
ఈసీ లక్ష్యం : రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని, పన్ను మినహాయింపులు, ఇతర ప్రత్యేక హక్కులను పొందుతూ, ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకుండా, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న పార్టీలను ఏరివేయడమే లక్ష్యంగా ఈసీ ఈ కసరత్తు చేపట్టింది. ఈ చర్యల ద్వారా రాజకీయ వ్యవస్థలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.


