Election Commission New Rules From Bihar Assembly Elections: ఈవీఎంల విశ్వసనీయతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్టీ గుర్తుతో పాటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఫోటోలను కూడా ఈవీఎం బ్యాలెట్లపై ముద్రించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధన త్వరలోనే జరగబోయే బీహార్ ఎన్నికల నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. ఈవీఎం బ్యాలెట్లపై కలర్ ఫోటోలను ముద్రించడం వల్ల ఓటర్లకు మరింత స్పష్టం వస్తుందని పేర్కొంది. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఓటర్లకు స్పష్టంగా కనిపించేలా ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోను ముద్రించనుంది. ‘ఎన్నికల ప్రక్రియలను మరింత సులభతరం, పారదర్శకంగా చేయడం కోసం, ఓటర్ల సౌలభ్యాన్ని మరింత పెంచడానికి గత 6 నెలల్లో తీసుకున్న 28 సంస్కరణల సరసన ఇది నిలుస్తుంది’ అని ఈసీ తన ప్రకటనలో వెల్లడించింది. తాజా నిబంధనతో ఈవీఎంలపై పోటీచేసే అభ్యర్థుల సీరియల్ నెంబర్లు, పేర్లు ఒకే రకమైన ఫాంట్ టైప్‌లో, పెద్ద అక్షరాల్లో ముద్రించనున్నారు. తద్వారా ఓటర్లకు అభ్యర్థుల పేరు, ఫోటో సులభంగా కనిపిస్తుంది. అలాగే, ఈవీఎం బ్యాలెట్ 70 జీఎస్ఎం పేపర్‌పై ముద్రించనున్నారు.
ఈవీఎంల విశ్వసనీయతపై ప్రతిపక్షాల అనుమానాలు..
కాగా, ఈవీఎంలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని, బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓట్ చోరీ గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అంతేకాదు, బీజేపీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని, పలు రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్తించారు. రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి బిహార్‌లో ‘ఓటు చోరీ యాత్ర’ చేపట్టారు. ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టవిరుద్దమని నిర్దారణ అయితే.. రద్దుచేస్తామని ఈసీని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఇదే సమయంలో ఓటర్ నమోదుకు ఆధార్ కార్డును కూడా 12వ పత్రంగా తీసుకోవాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. వచ్చే నెల 7న ఈ అంశంపై విచారణ జరిపి, కేసును ముగిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ అంశంపై తాము ఇచ్చే తీర్పు దేశం మొత్తానికి వర్తిస్తుందని తేల్చిచెప్పింది.


