Bihar Assembly Elections: నేడు బిహార్ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యూల్ ఖరారు చేయనుంది. సాయంత్రం 4 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించనున్నట్లు తెలుస్తుంది. ఈమేరకు ఈసీ నుంచి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. బిహార్ అసెంబ్లీ గడువు వచ్చేనెల చివరివారంతో ముగియనుంది. దీంతో నవంబరు 22వ తేదీకి ముందే పోలింగ్ నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ ఇప్పటికే వెల్లడించారు. బిహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉండాగా.. మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే సీఈసీ బృందం రెండు రోజులు బిహార్‌లో పర్యటించింది.
ఎస్‌ఐఆర్‌తో బిహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళన: కేంద్ర ఎన్నికల సంఘం బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో కొత్త విధానాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. తగిన సమయంలో వాటిని దేశమంతటికీ విస్తరిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచడం వంటివి సంస్కరణలు ఇందులో ఉన్నట్లు తెలిపారు.
Also Read:https://teluguprabha.net/national-news/rijiju-slams-rahul-gandhi-foreign-remarks-2/
ఐదేళ్లలో మూడు సార్లు ప్రమాణస్వీకారం: ప్రస్తుతం బిహార్‌లో నీతీశ్ కుమార్ సీఎంగా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో అనగా.. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ.. రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయే నుంచి వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేరారు. మూడు పార్టీలతో కూడిన మహాగఠ్‌బంధన్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి కూడా ముఖ్యమంత్రిగా నీతీశ్‌నే ఎన్నుకుంది. అయితే ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదనే చెప్పాలి. 2024 జనవరిలో మహా కూటమి నుండి జేడీయూ విడిపోయి.. మళ్లీ ఎన్డీయే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో మరోసారి నీతీశ్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు.


