Sunday, July 13, 2025
Homeనేషనల్Khelo Bharat : 3.5 కోట్ల ఉద్యోగాలకు శ్రీకారం... క్రీడల్లో నవశకం!

Khelo Bharat : 3.5 కోట్ల ఉద్యోగాలకు శ్రీకారం… క్రీడల్లో నవశకం!

Union Cabinet Landmark Decisions:  క్రీడా రంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం (ఈఎల్‌ఐ)కు ఆమోదం లభించింది. ఈ పథకం కింద రూ. 1.07 లక్షల కోట్లతో రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా, ‘ఖేలో భారత్ నీతి’ పేరుతో జాతీయ క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టారు. పరిశోధనల కోసం రూ.1 లక్ష కోట్లు కేటాయించారు. ఈ నిర్ణయాలు యువత, క్రీడాకారులు, ఆర్థిక వృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.

- Advertisement -

ఈఎల్‌ఐ స్కీమ్: ఉద్యోగాలకు భారీ పుష్ : కేంద్ర కేబినెట్ జూలై 1, 2025న ఆమోదించిన ఈఎల్‌ఐ స్కీమ్ (ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం) దేశంలో ఉద్యోగ కల్పనకు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది. రూ.99,446 కోట్లతో ప్రారంభించిన ఈ పథకం, రాబోయే రెండేళ్లలో (ఆగస్ట్ 1, 2025 నుంచి జూలై 31, 2027 వరకు) 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించేలా ప్రణాళికలు రచించారు. ఇందులో 1.92 కోట్ల మంది తొలిసారిగా ఉద్యోగాలు పొందే యువత ఉండటం విశేషం. సమాచార, ప్రసార శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నట్లుగా, ఈ పథకం అన్ని రంగాల్లో, ప్రత్యేకించి తయారీ రంగంపై దృష్టి సారించి, దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం ఇవ్వనుంది. ఇది ఈఎల్‌ఐ స్కీమ్ కింద ఉద్యోగులతో పాటుగా యజమానులకు ప్రోత్సాహకాలు అందించనుంది.

తొలిసారి ఉద్యోగులకు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో నమోదైన తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి ఈ పథకం కింద ఒక నెల జీతం (గరిష్ఠంగా రూ.15,000) రెండు వాయిదాల్లో అందిస్తారు. నెలకు రూ.1 లక్ష వరకు జీతం పొందే వారు ఈ ప్రోత్సాహకానికి అర్హులు. ఉద్యోగంలో చేరిన 6 నెలల సేవ తర్వాత మొదటి వాయిదా, 12 నెలలు పూర్తి చేసి ఆర్థిక సాక్షరతా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత రెండవ వాయిదా అందుతుంది. ఇది యువతను ఉద్యోగంలో చేరేందుకు, నిలదొక్కుకునేందుకు ప్రోత్సహిస్తుంది.

యజమానులకు : నెలకు రూ.1 లక్ష వరకు జీతం పొందే ఉద్యోగులను నియమించుకునే యజమానులకు నెలకు రూ.3,000 వరకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకం ఇస్తారు. తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించిన యజమానులకు 3, 4వ సంవత్సరాలకు కూడా ప్రోత్సాహకాలు పొందే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హత సాధించాలంటే, 50 కంటే తక్కువ ఉద్యోగులున్న యజమానులు కనీసం 2 మందిని, 50కి ఎక్కువ ఉద్యోగులున్న వారు కనీసం 5 మందిని కొత్తగా నియమించుకోవాలి. ఇది చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

ఖేలో భారత్ నీతి:  ఉద్యోగ కల్పనతో పాటుగా, దేశ క్రీడా రంగానికి కూడా కేంద్ర కేబినెట్ పెద్ద పీట వేసింది.అందులో భాగంగా ‘ఖేలో భారత్ నీతి 2025’ పేరుతో జాతీయ క్రీడా విధానాన్ని కేబినెట్ ఆమోదించింది. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోని ఐదు ప్రధాన క్రీడా దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దడం, క్రీడలను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడం ఈ విధాన ప్రధాన లక్ష్యాలు. ” గత 11 ఏళ్లుగా ప్రధాని మోదీ గ్రామీణ క్రీడాకారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విధానం ద్వారా గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను వెలికితీసి, వారికి అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించి, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు” మంత్రి వైష్ణవ్ తెలిపారు.

పరిశోధన -మరిన్ని ప్రాజెక్టులు : ఉద్యోగాలు, క్రీడలతో పాటు, పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా కేంద్ర కేబినెట్ ప్రాధాన్యతనిచ్చింది. దేశంలో పరిశోధన-అభివృద్ధి (R&D) ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రూ.1 లక్ష కోట్లు కేటాయించారు. ఇది విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తుంది. అంతేకాకుండా, తమిళనాడులో పరంకుడి-రామనాథపురం హైవే విస్తరణకు రూ.1,853 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి, తద్వారా ఆర్థిక వృద్ధికి దోహదపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News