Elon Musk : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా సరే అది సంచలనంగా మారుతుంది. ఇటీవల ట్విటర్ పగ్గాలు అందుకున్న మస్క్.. తనదైన నిర్ణయాలతో అందరికి షాక్ ఇస్తున్నాడు. వేలాది మందిని ఉద్యోగాల నుంచి తీసివేశాడు. ట్విటర్ విధానాలను మార్చేశాడు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టుల ఖాతాలను తొలగించాడు. దీంతో ఆయనపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతుండగా మరో వైపు వైపు ట్విటర్ సంస్థ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
ఇలాంటి సమయంలో ఆయన ఓ ట్వీట్‌తో నెటిజన్ల ముందుకు వచ్చాడు. తాను ట్విటర్ సీఈవోగా కొనసాగాలా..? వద్దా అంటూ ఓ పోల్ పెట్టాడు. అందులో వచ్చే ఫలితం ఏదైనా సరే దాని ప్రకారమే నడుచుకుంటానని చెప్పాడు. సాయంత్రం 4.30 గంటల వరకు ఈ పోల్ కొనసాగనుంది. ఈ పోలింగ్‌లో ఇప్పటి వరకు 58 శాతం మంది సీఈఓ పదవి నుంచి మస్క్ తప్పుకోవాలంటూ ఓటు వేయగా, 42 శాతం మంది కొనసాగాలని కోరారు. పోల్ ఇలాగే కొనసాగితే మస్క్ చెప్పినట్లుగా సీఈఓ పదవి నుంచి తప్పుకుంటారో లేదో చూడాలి.