Sunday, November 16, 2025
Homeనేషనల్Operation Mahadev: ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

Operation Mahadev: ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు మరో విజయవంతమైన ఎన్‌కౌంటర్‌ నిర్వహించాయి. శ్రీనగర్‌కు సమీపంలోని హర్వాన్‌ పర్వత ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌ కి ఆపరేషన్‌ మహదేవ్‌ గా పేరు పెట్టారు. ఈ ఆపరేషన్‌ ని భారత సైన్యం, సీఆర్పీఎఫ్‌, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా చేపట్టారు.

- Advertisement -

పహల్గాం ఉగ్రదాడిలో భాగస్వాములుగా గుర్తించిన ముగ్గురు ఉగ్రవాదుల నుంచి ఏకే-47, ఎం4 కార్బైన్‌, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చినార్‌ కోర్‌ తెలిపింది. హతమైన వారిలో ఒకరు జిబ్రాన్‌గా గుర్తించబడగా, ఇతను గతేడాది అక్టోబర్‌లో సోనామార్గ్‌ సొరంగం వద్ద జరిగిన దాడికి ప్రధాన సూత్రధారి. ఆ దాడిలో ఏడుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరొకడు సులేమాన్‌ సాహా అలియాస్‌ హషీం ముషా అని భద్రతా వర్గాలు వెల్లడించాయి.

Readmore: https://teluguprabha.net/national-news/if-you-are-planning-to-pursue-higher-education-in-canada-based-on-your-interests/

ఈ దాడికి సంబంధించి హర్వాన్‌ ప్రాంతంలో అనుమానాస్పద కమ్యూనికేషన్‌ పరికరాలు గుర్తించడంతో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. దాచిగమ్‌ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే 24 రాష్ట్రీయ రైఫిల్స్‌, 4 పారా కమాండోల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.

ఇటీవల ఏప్రిల్‌ 22న పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఆ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు మృతి చెందారు. ఆ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ బాధ్యత స్వీకరించి అనంతరం వెనక్కి తీసుకుంది.

Readmore: https://teluguprabha.net/national-news/stampede-in-manasa-devi-temple-in-haridwar/

ఈ తాజా ఎన్‌కౌంటర్‌తో ఆ దాడిలో పాల్గొన్న ముగ్గురు విదేశీ ఉగ్రవాదులను మట్టు బెట్టినట్లు సమాచారం. భద్రతా బలగాల ముమ్మర శోధనల వల్లే ఈ విజయవంతమైన ఆపరేషన్‌ సాధ్యపడిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఇంకా పూర్తి స్థాయిలో సైనిక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad