EPFO UPI withdrawal facility: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తన సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా వాట్సాప్‌ను వినియోగించుకోనుంది. ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత సర్వీసుల కోసం త్వరలో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ యాప్ ద్వారా కోట్లాది మందిని చేరుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ భావిస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. “వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. గ్రీన్ టిక్ మార్క్ కలిగిన ఈపీఎఫ్‌ఓ వాట్సప్ నంబర్‌కు ‘హలో’ అని మెసేజ్ చేయడం ద్వారా ఈ సేవలు పొందొచ్చు. యూఏఎన్‌తో అనుసంధానం అయిన మొబైల్ నంబర్ ద్వారా ఈ సేవలు లభిస్తాయి. ఈపీఎఫ్‌ఓ నుంచి సందేశాలు సైతం స్థానిక భాషల్లో ఎప్పటికప్పుడు అందుకోవచ్చు. ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా 24/7 వాట్సప్‌లో సేవలు లభిస్తాయి.” అని వెల్లడించారు. రాబోయే నెల రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు.
త్వరలోనే యూపీఐ ద్వారా పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా..
యూపీఐ ద్వారా పీఎఫ్ నిల్వలను విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా త్వరలోనే అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి వెల్లడించారు. యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా ఈపీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా ప్రక్రియను విజయవంతంగా పరీక్షించినట్లు చెప్పారు. ఈ లావాదేవీలు నిర్వహించేందుకు యూపీఐ పిన్ అవసరం అవుతుందని, అలా విత్‌డ్రా అయిన మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. ఆపై ఏటీఎం లేదా యూపీఐ ద్వారా నగదును తమ అవసరాలకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సేవలు సజావుగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సాఫ్ట్‌వేర్ లోపాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఏడు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.

