EPS 95 Big Update: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం కమిటీ ఏర్పాటు చేస్తూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌కు ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈపీఎస్ 95 పెంపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కనీస పెన్షన్ 7500 రూపాయలకు పెంచాలనే డిమాండ్ పై కీలకమైన అప్‌డేట్ వెలువడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం కమిటీ ఏర్పడింది. అటు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌కు కూడా ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న ఈపీఎస్ 95 పెంపు అంశంపై మరోసారి చర్చ జరుగుతోంది. ఇప్పటికే కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి 7500 రూపాయలకు పెంచాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా 2022 నవంబర్ నెలలో తీర్పు ఇచ్చింది. కనీస పెన్షన్ 1000 నుంచి 7500 రూపాయలు చేయాలని స్పష్టం చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తోంది. తాత్సారం చేస్తోంది.
దేశవ్యాప్తంగా 78 లక్షల మంది ఈపీఎస్ 95 పెంపు కోసం చూస్తున్నారు. ఈపీఎస్ 95 అనేది 1995లో ప్రారంభమైంది. దీని ప్రకారం ఉద్యోగి వాటా 12 శాతం, యజమాని వాటా 12 శాతం ఉంటుంది. యజమాని వాటాలోని 12 శాతం నుంచి 8.33 శాతం ఈపీఎస్‌కు చేరుతుంది. మరో 1.16 శాతంను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. 58 ఏళ్ల తరువాత పెన్షన్ అందుతుంది. అయితే ప్రస్తుతం ఇస్తున్న 1000 రూపాయల కనీస పెన్షన్ ఎటూ సరిపోవడం లేదు. అందుకే ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ పెంపును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. ఈపీఎఫ్ఓ వద్ద ఇప్పటికే అన్‌క్లెయిమ్డ్ ఫండ్స్ 53 వేల కోట్లు ఉంటే యజమాని వాటాగా వసూలు చేయాల్సింది 21 వేల కోట్లున్నాయి. కనీస పెన్షన్ పెంచితే కేంద్ర ప్రభుత్వంపై అదనంగా 13,500 కోట్ల భారం పడుతుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు ఆందోళనగా ఉన్నారు. మరోవైపు కనీస పెన్షన్ 7500 రూపాయలు కాకుండా 2500 రూపాయలు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కానీ ఇది సరిపోదనిపెన్షనర్లు వాదిస్తున్నారు. ఈపీఎస్ 95 పెంపు అంశం కేంద్రం వద్ద ప్రస్తుతం పరిశీలనలో ఉందని, త్వరలో అంటే నవంబర్ లేదా డిసెంబర్ నెలలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూఖ్ మాండవియా చెబుతున్నారు.


