HomeTop StoriesEthanol petrol: పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్.. వాహనదారులకు వరమా? భారమా?

Ethanol petrol: పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్.. వాహనదారులకు వరమా? భారమా?

హైదరాబాద్ (తెలుగుప్రభ): ఒకప్పుడు పెట్రోల్ బంక్‌కు వెళ్లి “ఫుల్ ట్యాంక్” చేయించుకోవడమే ఇంధన వినియోగానికి పరిమితమైతే, ఇప్పుడు అదే పెట్రోల్‌లో ఎంత శాతం ఇథనాల్ కలిసింది. మన బైక్ లేదా కారు దానికి అనుకూలమా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం. ప్రస్తుతం దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలతో భారత్ ఇథనాల్ వినియోగాన్ని వేగంగా విస్తరిస్తోంది. అయితే, ఈ మార్పు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత ప్రయోజనం చేకూరుస్తుంది? పెట్రోల్ వాహనాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? వినియోగదారుడికి లాభమా? నష్టమా అన్న ప్రశ్నలు సగటు వాహన దారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

- Advertisement -

చమురు దిగుమతులే భారత్‌కు అతిపెద్ద సవాలు

భారత్ ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత అత్యధికంగా చమురును వినియోగించే దేశాల్లో ఒకటి. దేశానికి అవసరమైన ముడి చమురులో 85–88 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశీ మారక నిల్వలపై భారీ భారం పడటంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం భారత్ చమురు దిగుమతుల కోసం రూ. 12 లక్షల కోట్ల నుంచి రూ.18 లక్షల కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాలు, ఉత్పత్తి కోతలు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు ఈ ఖర్చును మరింత పెంచే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపి వినియోగించే విధానానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇథనాల్ అనేది వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే జీవ ఇంధనం (బయోఫ్యూయల్), చెరకు రసం, మొలాసిస్, మొక్కజొన్న, విరిగిన బియ్యం, వరి, అలాగే వ్యవసాయ వ్యర్థాల నుంచి దీనిని తయారు చేస్తారు. శిలాజ ఇంధనం అయిన పెట్రోల్‌కు భిన్నంగా ఇది పునరుత్పాదక ఇంధనం.

2022 నాటికి 10శాతం ఇథనాల్ వాడకం

2014లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం కేవలం 1.5 శాతం మాత్రమే ఉండేది. కానీ, ప్రభుత్వ విధానపరమైన ప్రోత్సాహంతో అది 2022 నాటికి 10 శాతం దాటింది. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ-20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ-20 అమలు కోసం చమురు సంస్థలు, ఆటోమొబైల్ కంపెనీలు, చక్కెర పరిశ్రమలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

రైతులకు కొత్త మార్కెట్..

ఇథనాల్ విధానం వల్ల అత్యధిక లాభం పొందుతున్న వర్గం రైతులే. గతంలో చక్కెర మిల్లుల వద్ద చెరకు బకాయిలు నెలల తరబడి పెండింగ్‌లో ఉండేవి. ఇప్పుడు ఇథనాల్ తయారీకి కూడా చెరకు వినియోగం పెరగడంతో మిల్లులకు అదనపు ఆదాయం వస్తోంది. మొక్కజొన్న, విరిగిన బియ్యం వంటి పంటలకు కూడా కొత్త మార్కెట్ ఏర్పడుతోంది. దీనివల్ల వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇథనాల్ దహన సమయంలో కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు వంటి హానికర ఉద్గారాలు పెట్రోల్‌తో పోలిస్తే తక్కువగా ఉంటాయి. దీంతో పట్టణాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కొంత మేర ఉపయోగపడుతుంది.

Also Read: KTR: కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు వారం రోజులు అప్పగించండి.. తెలంగాణ మొత్తానికి నీరందిస్తామని కేటీఆర్ సవాల్‌

వాహనదారుల్లో ఆందోళన?

ఇథనాల్ వినియోగం పెరిగినప్పటి నుంచి వినియోగదారుల్లో ప్రధానంగా రెండు సందేహాలు ఉన్నాయి—మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్‌కు నష్టం జరుగుతుందా? ఆటోమొబైల్ నిపుణుల ప్రకారం ఇథనాల్‌లో శక్తి సాంద్రత పెట్రోల్ కంటే సుమారు 30–35 శాతం తక్కువ. అయితే ఈ-20లో కేవలం 20 శాతం మాత్రమే ఇథనాల్ ఉంటుంది. అందువల్ల వాస్తవ వినియోగంలో మైలేజ్ 3 నుంచి 7 శాతం వరకు మాత్రమే తగ్గే అవకాశం ఉంది. కొత్త ఈ-20 అనుకూల వాహనాల్లో ఈ ప్రభావం మరింత తక్కువగా ఉండొచ్చని తయారీ సంస్థలు చెబుతున్నాయి. కొత్త బీఎస్6 వాహనాలు ఎక్కువగా ఈ-20 వరకు అనుకూలంగా రూపొందించబడుతున్నాయి.పాత వాహనాల్లో మైలేజ్ 2%–5% వరకు తగ్గే అవకాశం ఉందని ఆటో పరిశ్రమ అంచనా వేస్తున్నాయి. ఇంధన వ్యవస్థ భాగాలపై (రబ్బర్, మెటల్ పార్ట్స్ ) అదనపు దెబ్బ తగలకుండా మార్పులు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

పాత వాహనాల పరిస్థితేంటి?

2018కు ముందు తయారైన కొన్ని వాహనాల్లో ఇంధన పైపులు, రబ్బరు సీల్స్, ఇంజెక్షన్ వ్యవస్థలు అధిక ఇథనాల్‌కు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. దీర్ఘకాల వినియోగంలో ఇంధన వ్యవస్థలో నిర్వహణ అవసరం పెరగవచ్చు. అయితే ఇటీవల విడుదలవుతున్న వాహనాలు ఈ-20 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందుతున్నాయి.

ఇథనాల్‌ మిశ్రమంతో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?

ఇథనాల్‌ను, పెట్రోల్‌తో కలపడం వల్ల ఇంధన ఉత్పత్తి ఖర్చు కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆ ప్రయోజనం వినియోగదారుడి స్థాయికి చేరడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. పెట్రోల్ రిటైల్ ధరలపై పన్నులు, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు,ముడి చమురు ధరలు, కేంద్ర-రాష్ట్ర పన్నులు, రిఫైనింగ్ ఖర్చులు, రవాణా వ్యయం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉన్నాయి. ఇథనాల్ మిశ్రమం వల్ల వెంటనే ధరలు భారీగా తగ్గే అవకాశం లేదు. అయితే వాహన వినియోగదారుల పరంగా చూస్తే, మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇథనాల్ మిశ్రమం వల్ల మొత్తం వ్యవస్థకు ప్రయోజనం ఉన్నప్పటికీ, పెట్రోల్ ధరలు తగ్గుతాయనే అంచనాలు తక్కువేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇథనాల్ వాడకంపై సవాళ్లు లేకపోలేదు..

ఇథనాల్ వాడకంలో సవాళ్లు లేకపోలేదు. చెరకు సాగు అధిక నీటిని వినియోగిస్తుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఇది సమస్యగా మారే అవకాశం ఉంది. అలాగే, మొక్కజొన్న, బియ్యం వంటి పంటలను అధికంగా ఇథనాల్ తయారీకి వినియోగిస్తే ఆహార భద్రతపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే రెండో తరం (2జీ) ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచ దేశాల అనుభవం ఇదే..

బ్రెజిల్ ప్రపంచంలో ఇథనాల్ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. అక్కడ చాలా వాహనాలు ఫ్లెక్స్-ఫ్యూయల్ సాంకేతికతతో పనిచేస్తాయి. అవి పెట్రోల్, ఈ-27, ఈ-85, ఈ-100 వంటి వివిధ మిశ్రమాలతో నడుస్తాయి. అమెరికాలో ఈ-10 సాధారణం కాగా, కొన్ని రాష్ట్రాల్లో ఈ-15, ఈ-85 కూడా వినియోగిస్తున్నారు. భారత్ కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది.

మారనున్న భవిష్యత్తు రూపురేఖలు?

రాబోయే దశాబ్దంలో భారత ఇంధన రంగంలో మూడు మార్పులు ఒకేసారిగా కనిపించే అవకాశం ఉంది. ఒకవైపు ఇథనాల్ మిశ్రమం పెరుగుతుంది. మరోవైపు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు మార్కెట్లోకి వస్తాయి. అదే సమయంలో విద్యుత్ వాహనాల వినియోగం కూడా పెరుగుతుంది. అంటే భవిష్యత్తులో పెట్రోల్ ఒక్కటే ఇంధనంగా ఉండే పరిస్థితి క్రమంగా మారనుంది. 2030 నాటికి ఇథనాల్ ఆధారిత ఇంధన వినియోగాన్ని మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ఈ-20, ఈ-85 అనుకూల ఇంజిన్లపై దృష్టి పెడుతోంది.ఇథనాల్ వినియోగం దేశ ఇంధన రంగాన్ని దిగుమతి ఆధారిత వ్యవస్థ నుంచి స్వయం ఆధారిత దిశగా మలిచే కీలక మార్పుగా మారుతోంది. ఇథనాల్ పెట్రోల్‌కు సంపూర్ణ ప్రత్యామ్నాయం కాదు. కానీ దేశ ఇంధన భద్రతకు కీలకమైన వ్యూహాత్మక ఇంధనం. స్వల్ప మైలేజ్ తగ్గుదల వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, విదేశీ చమురు దిగుమతుల తగ్గింపు, రైతులకు అదనపు ఆదాయం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటి దీర్ఘకాల ప్రయోజనాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. అయితే, చెరకు ఆధారిత ఉత్పత్తిపై అధికంగా ఆధారపడకుండా, వ్యవసాయ వ్యర్థాలు, ఇతర ప్రత్యామ్నాయ ముడి పదార్థాలతో ఇథనాల్ ఉత్పత్తిని విస్తరించడం, ఈ-20 అనుకూల వాహనాల వినియోగాన్ని పెంచడం, వినియోగదారుల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలే ఈ విజయాన్ని నిర్ణయిస్తాయి. ఇథనాల్ వైపు భారత్ అడుగులు వేస్తున్న వేళ, ఇది కేవలం ఇంధన మార్పు మాత్రమే కాదు… దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, పర్యావరణం, ఆటోమొబైల్ రంగాలను ఒకేసారి ప్రభావితం చేసే మౌలిక సంస్కరణగా చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News