Saturday, November 15, 2025
Homeనేషనల్EU sanctions: రష్యాపై ఈయూ కొరడా.. గుజరాత్ రిఫైనరీకి గండం!

EU sanctions: రష్యాపై ఈయూ కొరడా.. గుజరాత్ రిఫైనరీకి గండం!

India EU Sanctions Duel: ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఐరోపా సమాఖ్య (ఈయూ) ఉక్కుపాదం మోపుతోంది. మాస్కో ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆంక్షల అస్త్రాలను సంధిస్తోంది. అయితే, ఈ ఆంక్షల సెగ తొలిసారిగా నేరుగా భారత్‌ను తాకింది. ఈయూ తీసుకున్న తాజా నిర్ణయంతో గుజరాత్‌లోని వాదినార్ కేంద్రంగా పనిచేస్తున్న ‘నయారా ఎనర్జీ’ రిఫైనరీపై ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అసలు, రష్యాపై విధించిన ఆంక్షలు భారత కంపెనీని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈయూ చర్యలపై భారత ప్రభుత్వం ఎందుకు అంత తీవ్రంగా స్పందించింది? ఈ ద్వంద్వ నీతి వెనుక ఉన్న అసలు కథేంటి?

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. అసలు కథ ఇదీ.. ఏమిటీ సంబంధం..?

ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ప్రతిగా రష్యా చమురు ఎగుమతులను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈయూ తన 14వ ప్యాకేజీ ఆంక్షలను ప్రకటించింది. ఈ ఆంక్షల జాబితాలో గుజరాత్‌లోని నయారా ఎనర్జీ రిఫైనరీ పేరు చేరడం గమనార్హం. నయారా ఎనర్జీలో రష్యా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజమైన ‘రోస్‌నెఫ్ట్’కు 49.1 శాతం వాటా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ వాటా కారణంగానే నయారా ఎనర్జీని లక్ష్యంగా చేసుకున్నామని ఈయూ విదేశాంగ విధానాల విభాగం అధిపతి కాజా కలస్ స్పష్టం చేశారు.

ద్వంద్వ ప్రమాణాలను సహించం’ – భారత్ ఘాటు స్పందన

నయారా ఎనర్జీపై ఈయూ ఏకపక్షంగా విధించిన ఆంక్షలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇంధన భద్రత విషయంలో ఐరోపా దేశాల ద్వంద్వ ప్రమాణాలను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. “భారత ప్రజల కనీస అవసరాలను తీర్చే ఇంధన భద్రతకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. చట్టపరమైన నిబంధనలకు లోబడే బాధ్యతాయుతంగా చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఇంధన వాణిజ్యంలో ద్వంద్వ ప్రమాణాలకు తావుండకూడదని మేం మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం,” అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా ప్రకటన విడుదల చేశారు.

ఏమిటీ ఈయూ కొత్త ఆంక్షలు:

రష్యాకు చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించడమే ఈయూ ప్రధాన లక్ష్యం. అందుకోసం రష్యన్ ముడి చమురుపై ధరల పరిమితిని (ప్రైస్ క్యాప్) విధించింది. ప్రస్తుతం బ్యారెల్‌కు 60 డాలర్లుగా ఉన్న ఈ పరిమితిని మరింత తగ్గించాలని నిర్ణయించింది. తాము నిర్దేశించిన ధరల పరిమితికి లోబడి రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు మాత్రమే ఐరోపాకు చెందిన రవాణా నౌకలు, బీమా సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా, రాడార్లకు చిక్కకుండా చమురు రవాణా చేస్తున్న మరో 105 ఆయిల్ ట్యాంకర్లను ‘నీడ నౌకలు’గా గుర్తించి, వాటిపై కూడా ఆంక్షలు విధించింది.

నయారా ఎనర్జీపై ప్రభావం ఎంత:

ఒకప్పుడు ఎస్సార్ ఆయిల్‌గా ఉన్న ఈ రిఫైనరీని 2017లో రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్ నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసి ‘నయారా ఎనర్జీ’గా పేరు మార్చింది. ఏటా 20 మిలియన్ టన్నుల చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీ, తన ఉత్పత్తులలో సింహభాగాన్ని ఐరోపా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంది. కంపెనీ ఆదాయంలో అధిక భాగం ఈ ఎగుమతులపైనే ఆధారపడి ఉంది.
తాజా ఈయూ ఆంక్షల కారణంగా, నయారా ఎనర్జీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఐరోపా దేశాలు వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది. దీనివల్ల కంపెనీ ఎగుమతులు భారీగా పడిపోయి, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇది రిఫైనరీ కార్యకలాపాలను దెబ్బతీయడమే కాకుండా, వేలాది మంది ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసే ముప్పు పొంచి ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఇతర ఆర్థిక ఆంక్షల కారణంగా రోస్‌నెఫ్ట్ సంస్థ తన వాటాను అమ్ముకుని బయటకు వెళ్లే మార్గాలు కూడా మూసుకుపోయాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad