వివాహేతర సంబంధాలు ప్రస్తుత కాలంలో పెరిగిపోయాయి. రోజుకు ఎక్కడో చోట వివాహేతం సంబంధాల వల్ల కలిగే అనర్థాల వార్తలు వింటూనే ఉన్నాం. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడటమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు జరుగుతున్నాయి. భర్త ఉండగానే భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం.. వారితో పిల్లలను కనడం కూడా ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. అయితే ఇలా పుట్టిన పిల్లలకు అసలు తండ్రి ఎవరనే వాదన తెరపైకి వచ్చింది. తాజాగా ఇలాంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన సంచలన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం భారతీయ సాక్ష్యాధికార చట్టంలోని సెక్షన్ 112 ప్రకారం వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన పిల్లలను భర్త వారసులుగా గుర్తించే అవకాశం ఉందని పేర్కొంది. పిల్లల పితృత్వాన్ని నిర్థారించడానికి డీఎన్ఏ పరీక్షలకు ప్రతీసారీ ఆదేశించకూడదని స్పష్టం చేసింది. అసలు ఏం జరిగిందంటే.. కేరళకు చెందిన ఓ మహిళ 1991లో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమెకు 2001లో ఒక కుమారుడు జన్మించాడు. దీంతో కొచ్చిన్ మున్సిపల్ కార్పొరేషన్ జన్మ ధ్రువపత్రంలో బాలుడి తండ్రి స్థానంలో ఆమె భర్త పేరును నమోదు చేసింది. అనంతరం ఆ జంట మధ్య విభేదాలు రావడంతో 2003 నుంచి విడివిడిగా జీవించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమె 2006లో తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.
విడాకులు మంజూరైన వెంటనే కొచ్చిన్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి.. తన కుమారుడు తన మాజీ భర్తకు జన్మించలేదని తెలిపింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం వల్ల పుట్టాడని.. అందుచేత బర్త్ సర్టిఫికేట్‌లో తండ్రి పేరును మార్చాలని కోరింది. ఇందుకు అధికారులు అంగీకరించలేదు. కోర్టు తీర్పు లేకుండా ఇలా పేర్లు మార్చడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో ఆమె 2007లో స్థానిక కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో స్థానిక కోర్టు వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి, కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. పిల్లాడు కడుపులో ఉన్న సమయంలో భార్యాభర్తలు కలిసి లేరని నిరూపిస్తే వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి డీఎన్ఏ పరీక్ష చేసుకోవాలని ఆదేశించగలమని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఆ మహిళ కుమారుడు 2015లో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు ఆరోగ్యపరమైన ఖర్చులను తన తల్లి భరించలేకపోతోందని తండ్రి నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని పేర్కొన్నాడు. దీంతో ఆ యువకుడికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పిల్లవాడు కడుపులో పడిన సమయంలో సదరు మహిళ భర్తతో కలిసి ఉంటే మాత్రం.. ఆ భర్తే పిల్లాడికి తండ్రి అవుతాడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దీంతో ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భర్తతో కలిసి ఉన్నా వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని కన్న పిల్లలకు ఆ భర్త ఎలా తండ్రి అవుతాడని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తీర్పుల వల్ల అక్రమ సంబంధాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతదున్నారు.