Every Day Is Painful Lone Air India Crash Survivor: ఒకరు బతికి బయటపడితే అది అద్భుతమే. కానీ ఆ బతుకు అంతులేని శాపంగా మారితే? సరిగ్గా అదే అనుభవిస్తున్నాడు లండన్‌లో నివసించే 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించగా, ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ఆయనే.
టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే..
లండన్ వెళ్లాల్సిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. అది పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, టేకాఫ్ అయిన వెంటనే రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడమే ఈ ప్రమాదానికి కారణం.
ALSO READ: Lucknow Gastronomy: లక్నో లొట్టలేయించే రుచులకు విశ్వఖ్యాతి.. యునెస్కో జాబితాలో నవాబుల నగరం!
విమానంలో 241 మంది ఉండగా, అత్యవసర నిష్క్రమణ మార్గం పక్కన 11A సీటులో కూర్చున్న రమేష్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతని సోదరుడు అజయ్ ఈ ప్రమాదంలో మరణించాడు.
బ్రతికినా శాపమే..
“నేను బతికిన ఏకైక వ్యక్తిని. ఇప్పటికీ నాకు నమ్మశక్యం కావడం లేదు, ఇది ఒక అద్భుతం,” అని రమేష్ తెలిపారు. “నేను నా సోదరుడిని కూడా కోల్పోయాను. అతను నా వెన్నెముక. గత కొన్ని సంవత్సరాలుగా అతను నాకు అండగా ఉన్నాడు.”
ప్రమాదం జరిగిన మరుసటి రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసుపత్రిలో రమేష్‌ను పరామర్శించారు. లండన్‌లోని లీసెస్టర్‌కు తిరిగి చేరుకున్న తర్వాత, రమేష్‌ని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. “ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. గదిలో కూర్చుంటాను, నా భార్యతో, కొడుకుతో కూడా మాట్లాడను. మానసికంగా, శారీరకంగా బాధపడుతున్నాను. మా అమ్మ గత నాలుగు నెలలుగా తలుపు బయట కూర్చుంది, ఎవరితో మాట్లాడడం లేదు. ప్రతి రోజు మా కుటుంబానికి బాధాకరంగా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రమేష్‌కి పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. రమేష్‌కు ఎయిర్ ఇండియా 21,500 UK పౌండ్ల (సుమారు రూ. 22 లక్షలు) మధ్యంతర పరిహారాన్ని అందించింది.
మంగోలియాలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్..
శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒకటి సాంకేతిక సమస్య కారణంగా మంగోలియాలోని ఉలాన్‌బాతార్‌లో అకస్మాత్తుగా ముందు జాగ్రత్తగా ల్యాండ్ అయింది. మార్గమధ్యంలో ఫ్లైట్ సిబ్బందికి సాంకేతిక సమస్య తలెత్తినట్లు అనుమానం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌లైన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, విమానం సురక్షితంగా ఉలాన్‌బాతార్‌లో ల్యాండ్ అయింది. ప్రస్తుతం దానికి అవసరమైన తనిఖీలు జరుగుతున్నాయి.


