Son’s Murder After Videos Allege Father-Wife Affair: పంజాబ్ రాజకీయాల్లో, పోలీస్ ఉన్నతాధికారుల వర్గాల్లో పెను సంచలనం రేగింది. పంజాబ్ మాజీ మంత్రి, ఆమె భర్త (మాజీ టాప్ కాప్) ఏకంగా కన్న కొడుకు హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. 33 ఏళ్ల బాధితుడు మరణించడానికి కొన్ని వారాల ముందు రికార్డ్ చేసినట్లు భావిస్తున్న వీడియోలు ఇప్పుడు ఈ కేసును ఊహించని మలుపు తిప్పాయి.
పంజాబ్ మాజీ డీజీపీ మొహమ్మద్ ముస్తఫా, మాజీ మంత్రి మరియు కాంగ్రెస్ నాయకురాలు రజియా సుల్తానా కుమారుడు అఖిల్ అక్తర్ (33) గత వారం పంచకులలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డ్రగ్ ఓవర్ డోస్ వల్లే అఖిల్ చనిపోయాడని కుటుంబం మొదట ప్రకటించింది.
కానీ, అఖిల్ స్వయంగా రికార్డ్ చేసిన కొన్ని వీడియోలు బయటకు రావడంతో దర్యాప్తు మొత్తం తలకిందులైంది.
సంచలనం రేపుతున్న వీడియోలు
ఆగస్టులో రికార్డ్ చేసినట్లు భావిస్తున్న ఒక వీడియోలో, అఖిల్ తన తండ్రి (ముస్తఫా)కి, తన భార్యకు అక్రమ సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేశాడు. “నా భార్యకు మా నాన్నతో ఎఫైర్ ఉందని తెలుసుకున్నాను. నేను తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాను. నన్ను ఏదో ఒక తప్పుడు కేసులో ఇరికిస్తారని, నన్ను చంపేస్తారని భయంగా ఉంది,” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ కుట్రలో తన తల్లి రజియా, తన సోదరి కూడా భాగమేనని అఖిల్ ఆరోపించడం గమనార్హం. “నా పెళ్లికి ముందే మా నాన్నకు ఆమెతో పరిచయం ఉందేమోనని అనుమానంగా ఉంది. పెళ్లయిన మొదటి రాత్రే ఆమె నన్ను తాకనివ్వలేదు. ఆమె నన్ను కాదు, మా నాన్నను పెళ్లి చేసుకుంది,” అని అఖిల్ వీడియోలో వాపోయాడు.
కుటుంబ సభ్యులు తనను “పిచ్చివాడి”గా, “భ్రమల్లో బతుకుతున్నావని” ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని అతను ఆరోపించాడు. తనను బలవంతంగా రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపారని, “నేను డ్రగ్స్ తీసుకోకపోయినా నన్ను అక్రమంగా నిర్బంధించారు,” అని చెప్పాడు. “దయచేసి నన్ను కాపాడండి” అని వేడుకున్నాడు.
మాట మార్చిన మరో వీడియో
అయితే, మరో వీడియోలో అఖిల్ తన ఆరోపణలన్నీ వెనక్కి తీసుకున్నాడు. తనకు “స్కిజోఫ్రేనియా” (తీవ్రమైన మానసిక వ్యాధి) ఉందని, అందుకే కుటుంబ సభ్యులపై అవాస్తవ ఆరోపణలు చేశానని చెప్పాడు. “నా కుటుంబం చాలా మంచిది. అల్లా దయవల్ల వారు నాకు దొరికారు,” అని క్షమాపణ చెప్పాడు.
కానీ, అదే వీడియోలో అతని ముఖం కనిపించని సమయంలో, “వాళ్లు నన్ను చంపేస్తారా? వాళ్లంతా దుర్మార్గులు,” అని అకస్మాత్తుగా అనడం తీవ్ర గందరగోళానికి దారితీసింది.
రంగంలోకి దిగిన పోలీసులు
ఈ వీడియోలు మరియు కుటుంబ సన్నిహితుడైన షంసుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డీసీపీ సృష్టి గుప్తా మాట్లాడుతూ.. మొదట “ఫౌల్ ప్లే” ఏమీ లేదని భావించినా, ఈ వీడియోలు, ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొహమ్మద్ ముస్తఫా, రజియా సుల్తానా, అఖిల్ భార్య, సోదరిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ సంచలన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ను ఏర్పాటు చేశారు.
ALSO READ: Fire Accident: దీపావళి వేళ తీవ్ర విషాదం.. ఆరేళ్ల చిన్నారితో సహా నలుగురు అగ్నికి ఆహుతి.!


