Fireworks explosion in Tamilnadu: కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం సమీపంలో ఇటీవల బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మరువకముందే తమిళనాడులో కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విరుదునగర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఓ బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 18 మంది అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విరుదునగర్ జిల్లాలోని వెంబకోట్టై సమీపంలోని కట్టనార్‌పట్టి గ్రామంలో ఈ భారీ పేలుడు సంభవించింది. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విరుదునగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ధాటికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అగ్నిమాపక, రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాయి. “ఫ్యాన్సీ” రకం బాణసంచాను అసెంబ్లింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Also Read: https://teluguprabha.net/telangana/harish-rao-comments-on-cm-revanth-reddy-in-nalgonda-district/
సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే మంత్రులను ఘటనా స్థలానికి పంపించారు. సహాయకచర్యలను ముమ్మరం చేయాలని మంత్రును ఆదేశించారు.

