Karwa Chauth Nightmare :ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని హాపుర్ జిల్లా సస్నీగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కర్వచౌత్ రాత్రి చోటుచేసుకున్న ఘటన స్థానికులనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలను షాక్‌కు గురి చేసింది. కొత్తగా పెళ్లైన 12 మంది వధువులు కర్వచౌత్ పండుగ రాత్రి తమ భర్తల ఇళ్ల నుంచి నగలు, నగదు దోచుకొని పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ఒకదాని తరువాత ఒకటి బాధితులు పోలీస్‌స్టేషన్‌లను ఆశ్రయించారు. అన్ని కుటుంబాలు మోసపోయినట్లు తేలడంతో ఈ సంఘటన పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
పోలీసుల ప్రాథమిక విచారణలో వధువులను మధ్యవర్తుల ద్వారా బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లిళ్లన్నీ రెండు మూడు రోజుల క్రితమే జరిగాయని, పెళ్లి ఖర్చుల పేరుతో కుటుంబాలు బ్రోకర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. కర్వచౌత్ రోజున మహిళలు ఆచారం ప్రకారం ఉపవాసం ఉండి భర్తల కోసం పూజలు నిర్వహించారు. ఆ రాత్రి భోజనంలో మత్తు కలిగించే పదార్థాలు కలిపారు. కుటుంబ సభ్యులకు మత్తు నుంచి మెలకువ వచ్చేసరికి పెళ్లికూతుళ్తు ఇంట్లోని నగలు, వెండి వస్తువులు, క్యాష్ తీసుకొని మాయమయ్యారు. మొత్తం రూ.30 లక్షల వరకు ఆస్తులు మాయమైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
బాధితులు బ్రోకర్లను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ.. వారి ఫోన్ నంబర్లు స్విచ్‌ఆఫ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. మరికొన్ని ఫిర్యాదులు అందుతున్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. దొంగతనంపై ఇప్పటికే కేసులు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టినట్లు ఏఎస్పీ మయాంక్ పాఠక్ వెల్లడించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు ఏఎస్పీ.
ఈ కుట్ర పూర్తిగా ప్రణాళికాబద్ధంగా అమలైనట్లు పోలీసులు భావిస్తున్నారు. టార్గెట్ చేసిన కొన్ని కుటుంబాలకు వీరు పరిచయం చేసుకుని నమ్మకం సంపాదించి, సరైన సమయానికి పరారీ అయ్యారని వారు భావిస్తున్నారు. ఇలా పెళ్లి చేసుకుని కొద్ది రోజులకే డబ్బు, నగలతో పరారయ్యే పెళ్లికూతుళ్ల గురించి గతంలో కూడా అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి మోసాలను పోలీసులు అరికట్టాలని ప్రస్తుతం బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.


