Saturday, November 15, 2025
Homeనేషనల్Fake Embassy In India: ఏకంగా నకిలీ ఎంబసీ.. రాయబారమంతా బూటకం!

Fake Embassy In India: ఏకంగా నకిలీ ఎంబసీ.. రాయబారమంతా బూటకం!

Fake Embassy In India: నకిలీ పోలీస్ స్టేషన్లు, నకిలీ టోల్ గేట్ల గురించి విన్నాం. కానీ, ఏకంగా దేశ రాజధానికి కూతవేటు దూరంలో ఓ ఘరానా మోసగాడు నకిలీ రాయబార కార్యాలయాన్నే నడిపించాడు! దౌత్యపరమైన నంబర్ ప్లేట్లతో విలాసవంతమైన కార్లలో తిరుగుతూ, ఏకంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతితో దిగిన ఫొటోలను (మార్ఫింగ్ చేసినవి) చూపిస్తూ కళ్లుగప్పాడు. గుర్తింపులేని దేశాలకు రాయబారిగా తనను తాను ప్రకటించుకుని కోట్లకు పడగలెత్తాడు. అసలు ఎవరీ కేటుగాడు..? ఇతని మోసాల చిట్టా ఎలా బయటపడింది..?

- Advertisement -

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. స్థానిక గజియాబాద్‌లోని కవి నగర్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని, ఏకంగా ‘నకిలీ ఎంబసీ’ని నడిపిస్తున్న హర్ష వర్థన్ జైన్ అనే మోసగాడిని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి మోసాల తీరు విని పోలీసులే నివ్వెరపోయారు.

ఆపరేషన్ ‘ఫేక్ అంబాసిడర్’:

హర్ష వర్థన్ జైన్ తనను తాను ప్రపంచంలో గుర్తింపు లేని ‘వెస్ట్-ఆర్కిటికా’ అనే దేశానికి రాయబారిగా ప్రకటించుకున్నాడు. కేవలం ఆ ఒక్క దేశానికే కాకుండా, సబోర్గా, పౌల్వియా, లొడోనియా వంటి మరికొన్ని కల్పిత దేశాలకు కూడా తానే రాయబారి నంటూ ప్రచారం చేసుకున్నాడు.

ALSO READ: https://teluguprabha.net/national-news/villagers-build-road-chhattisgarh-dhamtari-protest/

నమ్మించే వ్యూహం:

ప్రజలను సులభంగా నమ్మించేందుకు, దౌత్యపరమైన (diplomatic) నంబర్ ప్లేట్లు కలిగిన నాలుగు విలాసవంతమైన కార్లను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇతర ప్రముఖులతో తాను సమావేశమైనట్లు అత్యంత నైపుణ్యంతో మార్ఫింగ్ చేసిన ఫొటోలను ప్రదర్శించేవాడు.

మోసాల పర్వం:

ఈ నకిలీ హోదాను అడ్డుపెట్టుకుని, విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయక ప్రజలను నమ్మబలికి భారీగా డబ్బు వసూలు చేశాడు. కేవలం ఉద్యోగాల పేరుతోనే కాకుండా, షెల్ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా హవాలా లావాదేవీలు కూడా నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ALSO READ: https://teluguprabha.net/national-news/karnataka-government-declared-holiday-today-for-schools-due-to-heavy-rains/

అంతర్జాతీయ సంబంధాలు:

విచారణలో నిందితుడికి అంతర్జాతీయ ఆయుధాల వ్యాపారి అద్నాన్ ఖశోగితో సంబంధాలు ఉన్నట్లు తెలియడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 2011లో ఇతను అక్రమంగా శాటిలైట్ ఫోన్‌ను వినియోగించిన కేసు కూడా నమోదై ఉందని అధికారులు వెల్లడించారు.

భారీగా నకిలీ పత్రాలు, నగదు స్వాధీనం:

నిందితుడి కార్యాలయం, నివాసంపై దాడి చేసిన ఎస్టీఎఫ్ పోలీసులు భారీ ఎత్తున నకిలీ పత్రాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. వాటిలో…
4 విలాసవంతమైన కార్లు
12 నకిలీ పాస్‌పోర్టులు
విదేశాంగ శాఖ ముద్రతో ఉన్న నకిలీ పత్రాలు
34 నకిలీ రబ్బర్ స్టాంపులు
2 నకిలీ ప్రెస్ కార్డులు
44.70 లక్షల రూపాయల నగదు
18 దౌత్యపరమైన నకిలీ నంబర్ ప్లేట్లు

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి నెట్‌వర్క్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad