Harshvardhan Jain Fake Embassy: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో నకిలీ రాయబార కార్యాలయాన్ని నడిపిస్తూ అరెస్టయిన హర్షవర్ధన్ జైన్ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతను కేవలం స్థానిక మోసగాడు కాదు, అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లతో సంబంధాలున్న ఓ భారీ చేప అని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) దర్యాప్తులో తేలింది. అసలు ఎవరీ హర్షవర్ధన్..? ఒక పాలరాతి వ్యాపారి.. అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదులతో ఎలా జతకట్టాడు..? ఈ మోసాల పుట్ట వెనుక ఉన్న అసలు కథేంటి..?
ఓ సాధారణ వ్యాపారి నుంచి అంతర్జాతీయ స్కామర్‌గా:
హర్షవర్ధన్ జైన్ (47) ప్రస్థానం ఓ సినిమా కథను తలపిస్తుంది. రాజస్థాన్‌లో పాలరాతి గనుల వ్యాపారం చేసే ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడైన హర్షవర్ధన్, గాజియాబాద్‌లో బీబీఏ, లండన్‌లో ఎంబీఏ చదివాడు. కొన్నాళ్లు తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ లండన్‌కు పాలరాయిని ఎగుమతి చేసేవాడు.
మలుపు తిప్పిన పరిచయం:
2000వ సంవత్సరంలో హరియాణాకు చెందిన చంద్రస్వామి అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం హర్షవర్ధన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ చంద్రస్వామే అతడిని పేరుమోసిన అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లు, ఆయుధాల వ్యాపారి అయిన అద్నాన్ ఖషోగ్గి, ఎహ్సాన్ అలీకి పరిచయం చేశాడు.
అంతర్జాతీయ మోసాలు ఆరంభం:
ఎహ్సాన్ అలీతో కలిసిన హర్షవర్ధన్, లండన్‌లో డజనుకు పైగా షెల్ కంపెనీలను స్థాపించాడు. ఈ కంపెనీల ద్వారా అనేక స్విస్ కంపెనీలకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, దాదాపు 25 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 250 కోట్లు) బ్రోకరేజ్ తీసుకొని చేతులెత్తేశారు. ఈ కేసులో ఎహ్సాన్ అలీని లండన్ పోలీసులు అరెస్ట్ చేయగా, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ కోర్టు అతనికి ఆరున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.
విస్తరించిన సామ్రాజ్యం:
2006లో దుబాయ్‌లో స్థిరపడిన హర్షవర్ధన్, అక్కడ షఫీక్, ఇబ్రహీంలతో కలిసి గల్ఫ్, ఆఫ్రికా దేశాల్లోనూ తన మోసాల సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ క్రమంలోనే అతడు దుబాయ్‌లో 6, మారిషస్‌లో 1, యూకేలో 3, భారత్‌లో 1 చొప్పున బ్యాంకు ఖాతాలను తెరిచినట్లు ఎస్టీఎఫ్ గుర్తించింది. రెండు వేర్వేరు పాన్ కార్డులను కూడా వినియోగించినట్లు తేలింది.
గాజియాబాద్‌లో దొరికిందిలా:
అంతర్జాతీయ స్థాయిలో మోసాలు చేస్తున్న హర్షవర్ధన్, చివరికి గాజియాబాద్‌లోని కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడుపుతున్న నకిలీ రాయబార కార్యాలయం ద్వారా పోలీసులకు చిక్కాడు.
ALSO READ: https://teluguprabha.net/national-news/pharmacy-students-invent-reusable-organic-pads/
మోసపు వల:
తాను రెండు దేశాలకు రాయబారినని, నాలుగు దేశాలకు రాజకీయ సలహాదారునని చెప్పుకుంటూ తిరిగేవాడు. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో దిగినట్లుగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను చూపిస్తూ, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను నమ్మించి కోట్లు కొల్లగొట్టాడు.
బయటపడ్డ బండారం:
ఈ నకిలీ ఎంబసీపై పక్కా సమాచారం అందుకున్న యూపీ ఎస్టీఎఫ్ బుధవారం మెరుపుదాడి చేసి హర్షవర్ధన్‌ను అరెస్టు చేసింది. అతని కార్యాలయం నుంచి నాలుగు లగ్జరీ కార్లు, 12 ఖరీదైన విదేశీ గడియారాలను స్వాధీనం చేసుకుంది.
ఒకప్పుడు పాలరాతి వ్యాపారిగా ఉన్న వ్యక్తి, అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్ల స్థాయికి ఎదగడం, చివరికి ఓ నకిలీ ఎంబసీ కేసులో కటకటాల వెనక్కి వెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఎస్టీఎఫ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసాల పుట్టను తవ్వేకొద్దీ మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.


