Saturday, November 15, 2025
Homeనేషనల్Fake Universities: దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు.. యూజీసీ నివేదికలో సంచలన విషయాలు

Fake Universities: దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు.. యూజీసీ నివేదికలో సంచలన విషయాలు

Fake Universities in Delhi and Uttar Pradesh: దేశవ్యాప్తంగా మొత్తం 22 నకిలీ విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నట్లు యూజీసీ సంచలన విషయాలు వెల్లడించింది. యూజీసీ తాజా డేటా ప్రకారం, ఈ యూనివర్సిటీల్లో అత్యధికంగా తొమ్మిది విద్యాసంస్థలు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నట్లు బయటపడింది. ఇక, మరో ఐదు యూనివర్సిటీలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. మిగిలిన నకిలీ యూనివర్సిటీలు కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కూడా ఉన్నట్లు యూజీసీ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఢిల్లీలోని నకిలీ యూనివర్సిటీలు తరచుగా బ్రోకర్ల నెట్‌వర్క్‌ల ద్వారా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆకర్షిస్తున్నాయి. అంతే కాకుండా నకిలీ విశ్వవిద్యాలయాలు విద్యార్థులను సులభంగా మోసగించడానికి అధికారిక సంస్థలను పోలిన పేర్లను ఉపయోగిస్తున్నాయి. ఈ సంస్థలు తమ పేర్లలో ‘నేషనల్’, ‘టెక్నాలజీ’, ‘మేనేజ్‌మెంట్’, ‘ఇన్‌స్టిట్యూట్’ వంటి పెద్ద పెద్ద పదాలను వాడుతూ, ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్లు భ్రమ కలిగిస్తున్నాయి.

- Advertisement -

యూజీసీ వెబ్‌సైట్‌లో యూనివర్సిటీల సమాచారం..

అలానే ఉత్తరప్రదేశ్‌లో నకిలీ సంస్థలు ‘విద్యాపథ్’, ‘పరిషత్’, ‘ఓపెన్ యూనివర్సిటీ’ వంటి పదాలను ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను మోసం చేస్తున్నాయి. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నకిలీ సంస్థల బారిన పడకుండా ఉండేందుకు యూజీసీ పలు సూచనలు చేసింది. విద్యార్థులు ఏదైనా సంస్థలో చేరే ముందు, అది యూజీసీ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) కింద లేదా సెక్షన్ 3 కింద ‘డీమ్డ్ యూనివర్సిటీ’గా గుర్తించబడిందో లేదో తప్పకుండా తనిఖీ చేయాలని కోరింది. ఆయా కోర్సులకు సంబంధించి ఏఐసీటీఈ (ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్), పీసీఐ (ఫార్మసీ), ఎన్‌ఎంసీ (మెడికల్) వంటి సంబంధిత కౌన్సిల్స్ నుండి సంస్థకు, కోర్సులకు అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని స్పష్టం చేసింది. యూజీసీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో గుర్తించబడిన విశ్వవిద్యాలయాలు, నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుందని, విద్యార్థులు ఆ జాబితాను తప్పక పరిశీలించాలని యూజీసీ సూచించింది. నకిలీ విద్యా సంస్థల్లో చేరితే, ఆ డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు లేదా ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లడం సాధ్యం కాదని హెచ్చరించింది. మరోవైపు, ఢిల్లీ లోని కోట్లా ముబారక్‌పూర్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజినీరింగ్ సంస్థపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థ అనుమతుల్లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోందని, ఈ యూనివర్సిటీ ద్వారా అందించే డిగ్రీలకు ఎలాంటి విలువ ఉండదని యూజీసీ స్పష్టం చేసింది. ఈ సంస్థ ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల కింద కూడా ప్రారంభించబడలేదని, దీనికి ఎటువంటి అనుమతుల్లేవని, విద్యార్థులు అడ్మిషన్‌ తీసుకొని మోసపోవద్దని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad