Family Carries Woman’s Body on Cot: ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి మరో సంఘటన అద్దం పట్టింది. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో ఒక కుటుంబం తమ 60 ఏళ్ల వృద్ధురాలి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు వాహనం లభించక, మంచంపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన ప్రభుత్వ ఆసుపత్రుల్లో శవ వాహనాల కొరతను మరోసారి ఎత్తిచూపుతోంది.
గరియాబంద్ జిల్లాలోని మెయిన్‌పుర్ బ్లాక్‌లోని అమ్లిపదర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతూ ఇచ్ఛాబాయి పటేల్ అనే 60 ఏళ్ల వృద్ధురాలు సోమవారం మరణించింది. ఆమె మరణించిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని శవ వాహనం అడిగారు. అయితే, వారు వాహనం ఇచ్చేందుకు నిరాకరించారని మృతురాలి బంధువు దీప్‌చంద్ పటేల్ తెలిపారు.
“శవ వాహనం కోసం అడిగితే ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. ప్రైవేట్ వాహనాల యజమానులు భారీగా డబ్బులు అడిగారు. అంత డబ్బు మేము భరించలేకపోయాం. అందుకే మాకు వేరే మార్గం లేక, మంచంపై శవాన్ని మోసుకెళ్లాల్సి వచ్చింది. ఆసుపత్రి నుంచి మా గ్రామం నాయాపారాకు దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది” అని దీప్‌చంద్ పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో నలుగురు వ్యక్తులు మంచంపై ఉన్న మృతదేహాన్ని భుజాలపై మోస్తూ రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నారు.
ALSO READ: Gold Smuggling Case: నటి రన్యా రావుకు రూ. 102 కోట్ల జరిమానా
ఈ సంఘటన గురించి తెలిసిన గరియాబంద్ కలెక్టర్ భగవాన్ సింగ్ ఉయికే స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా ప్రధాన వైద్య మరియు ఆరోగ్య అధికారి (CMHO)కి ఆదేశాలు జారీ చేశారు.
అయితే, ఆసుపత్రి సిబ్బంది శవ వాహనం వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పినా, వారు వేచి చూడలేదని సీఎంహెచ్ఓ చెప్పారని కలెక్టర్ తెలిపారు. అమ్లిపదర్‌లో ఉండే శవ వాహనం ప్రమాదంలో దెబ్బతిని పనిచేయడం లేదని కూడా ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఆరోగ్య విభాగానికి సూచించినట్లు కలెక్టర్ చెప్పారు.
ALSO READ: Patient Meals: ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ప్రత్యేక పోషకాహారం


