Saturday, November 15, 2025
Homeనేషనల్Crime News: ఎయిర్ కండిషనర్ పేలి.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

Crime News: ఎయిర్ కండిషనర్ పేలి.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

Crime News-Faridabad: ఫరీదాబాద్ నగరంలోని గ్రీన్ ఫీల్డ్ కాలనీ ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి వేదికైంది. ఒక అద్దె భవనంలోని రెండవ అంతస్తులో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందగా, ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన స్థానికులను కలవరపరిచింది.

- Advertisement -

బాల్కనీ నుంచి కిందకు..

సుమారు ఉదయం 3 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో రెండవ అంతస్తులో నివసిస్తున్న సచిన్ కపూర్ (49), ఆయన భార్య రింకు కపూర్ (48), వారి చిన్న కుమార్తె సుజ్జయిని (13) ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలోని పెద్ద కుమారుడు ఆర్యన్ కపూర్ (24) మాత్రం బాల్కనీ నుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. అయితే అతని కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఎసీ కంప్రెసర్ భారీ శబ్దంతో..

సమాచారం ప్రకారం, కుటుంబం నిద్రలో ఉండగా ఎసీ కంప్రెసర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ పేలుడు ప్రభావం అంతగా ఉండటంతో గది మొత్తం మంటలు, పొగ కమ్మేసాయి. గదిలోని వారంతా భయంతో పరుగెత్తేందుకు ప్రయత్నించారు. కానీ వెళ్లే తలుపు లాక్ అయ్యి ఉండటంతో దారిలోనే చిక్కుకుని శ్వాస ఆడక మూడుగురు మృతిచెందారు. వారితో పాటు ఉన్న పెంపుడు కుక్క కూడా ప్రాణాలు కోల్పోయింది.

అగ్నిమాపక సిబ్బందికి..

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, పేలుడు సంభవించిన క్షణాల్లోనే కాలనీ మొత్తం మోగిపోవడంతో స్థానికులు బయటకు వచ్చారు. గది నుంచి పొగలు ఎగసిపడటాన్ని చూసి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ టెండర్లు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆ తర్వాత బాధితులను స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి ముగ్గురు అప్పటికే మరణించారని ధృవీకరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎసీ కంప్రెసర్ టెక్నికల్ లోపం కారణంగా పేలిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కుటుంబం ఎదుర్కొన్న విషాదం స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది.

Also Read: https://teluguprabha.net/crime-news/third-wife-murders-husband-in-madhya-pradesh/

సచిన్ కపూర్ స్థానికంగా ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, ఆయన భార్య గృహిణి. కుమార్తె సుజ్జయిని స్కూలు చదువుకుంటుండగా, కుమారుడు ఆర్యన్ హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad