FINE FOR SMOKING IN PUBLIC PLACES : బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నియంత్రించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే రూ.1000 జరిమానా విధించనున్నారు. పరోక్ష ధూమపానం (సెకండ్ హ్యాండ్ స్మోకింగ్) వల్ల ఇతరుల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు.
నాలుగు సంవత్సరాల క్రితమే ఆమోదం :
ఈ నిర్ణయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (ఝార్ఖండ్ సవరణ) బిల్లు 2021’కి ఆమోదం తెలపడంతో అమల్లోకి వచ్చింది. గతంలో ఈ జరిమానా కేవలం రూ. 200 మాత్రమే ఉండేది. ఇప్పుడు అది ఐదు రెట్లు పెరిగి రూ. 1000కి చేరింది. హేమంత్ ప్రభుత్వం ఈ సవరణ బిల్లును నాలుగు సంవత్సరాల క్రితమే అసెంబ్లీలో ఆమోదించింది. ఈ బిల్లు చర్చల సమయంలో, అప్పటి ఎజేఎస్‌యూ ఎమ్మెల్యే లంబోదర్ మహతో జరిమానా మొత్తాన్ని రూ. 10,000కి పెంచాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో హుక్కా బార్లు నిషేధం :
జరిమానా పెంపుతో పాటు, ఝార్ఖండ్ ప్రభుత్వం పొగాకు నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టింది. 21 ఏళ్ల లోపు వారికి పొగాకు అమ్మడం నేరంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా, రాష్ట్రంలో హుక్కా బార్లను కూడా నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష లేదా రూ. 1 లక్ష వరకు జరిమానా విధించబడుతుంది. ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో జార్ఖండ్ ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయి.
FINE FOR SMOKING IN PUBLIC PLACES : బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే రూ.1000 జరిమానా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES