Fire Accident in Navi Mumbai: దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. కానీ మరికొన్ని చోట్ల మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బాణాసంచాలు పేలి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దీపావళి వేడుకల్లో తాజాగా మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
Also Read: https://teluguprabha.net/national-news/delhi-toxic-air-post-diwali-aqi-severe-level/
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహ్‌పూర్‌లో బాణాసంచా పేలుళ్ల కారణంగా ఏకంగా 70 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నవీ ముంబైలోని ఒక భవనంలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు.
నవీ ముంబై వాషిలోని సెక్టార్ 14 ఎంజీ కాంప్లెక్స్‌లోని రహేజా రెసిడెన్సీ సొసైటీలో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగడం కలకలం రేపింది. 10, 11, 12వ అంతస్తులు మంటల్లో చిక్కుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 10వ అంతస్తులో నివసిస్తున్న ఒక వృద్ధురాలు, 12వ అంతస్తులో నివసిస్తున్న దంపతులు, వారి ఆరేళ్ల కుమార్తె అగ్నికి ఆహుతయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న వాషి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. మృతదేహాలను స్వాధీనం చేసుకుంది.
మృతుల్లో కమలా హిరాల్ జైన్(84), దంపతులు సుందర్ బాలకృష్ణన్(44), పూజా రాజన్(39), చిన్నారి వేదికా సుందర్ బాలకృష్ణన్(6) ఉన్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో మంటలను ఆర్పడానికి దాదాపు 10 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు అధికంగా ఎగసిపడటంతో భవనం మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శాయశక్తులా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మంటలు భవనంలో భయాందోళనలకు గురిచేసినప్పటికీ, బాల్కనీలో నిలబడి ఉన్న చాలా మంది అరుపులు వినిపించాయి. ప్రజల సహాయంతో, మెట్లపై నుండి హైడ్రాలిక్ లిఫ్ట్ సహాయంతో వారిని రక్షించారు. కాగా, ప్రాథమిక దర్యాప్తులో అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా వెల్లడైంది. దర్యాప్తు ప్రారంభించిన అగ్నిమాపక శాఖ బాణసంచా కూడా కారణంగా భావిస్తోంది. ఈ మేరకు పోలీసులతో కలిసి ఆ ప్రాంతంలో దర్యాప్తు చర్యలు ముమ్మరం చేశారు.


