First Arrest on NEET paper leak: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో తొలి అరెస్టు చోటుచేసుకుంది. దర్యాప్తులో భాగంగా కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్న పి.వి.కులకర్ణిని పుణెలో పోలీసులు అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో కులకర్ణిని ప్రధాన సూత్రధారిగా కేంద్ర దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చింది. నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్‌టీఏలో భాగస్వామిగా ఉన్న ఆయన్ను ఇవాళ సుదీర్ఘ సమయం పాటు విచారించిన సీబీఐ.. అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. లాతూర్‌కు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణి సుదీర్ఘ కాలంగా నీట్ ప్రశ్నాపత్రాన్ని రూపొందించే నిపుణుల కమిటీలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అయితే, తనకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించిన ఆయన.. మరో నిందితుడితో కలిసి ఏప్రిల్ చివరి వారంలో పుణెలోని తన నివాసంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాడు.
Also read: CM Chandrababu: ఈసారి ఆన్‌లైన్‌లోనే పసుపు పండుగ.. మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం..!
చేతులు మారిన లక్షలాది రూపాయలు..
నీట్ పరీక్షలో వచ్చే ప్రశ్నలను, సమాధానాలను ముందుగానే విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించాడు. ఆయన నోట్‌బుక్‌లో రాసుకున్న ప్రశ్నలే మే 3న జరిగిన నీట్ పరీక్షలో వచ్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ సెషన్‌లో పాల్గొన్న విద్యార్థుల నుంచి నిందితులు లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం ఎక్కడ నుంచి లీకైందనే విషయంతో పాటు నగదు లావాదేవీల్లో ఉన్న మధ్యవర్తులను కనుగొన్నట్లు సీబీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని, కీలక దస్త్రాలు, పలు ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్ చేశామని తెలిపారు. వాటికి ఫొరెన్సిక్, సాంకేతిక విశ్లేషణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

