న్యూఢిల్లీ, అక్టోబర్ 6 (తెలుగు ప్రభ): తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలోని ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి నేడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలో తట్టాంచావడి స్థానానికి పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో రేజీనగర్, నందిగ్రామ్ స్థానాలకు, అసోంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు శుక్రవారం చేపట్టనున్నారు.
నందిగ్రామ్‌పై అందరి దృష్టి
పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో భబానీపూర్‌తో పాటు నందిగ్రామ్ నుంచి గెలిచిన సువేందు అధికారి అనంతరం భబానీపూర్ స్థానాన్ని కొనసాగించడంతో నందిగ్రామ్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభ్యర్థిగా హసిరాణి రాథ్ పోటీ చేస్తున్నారు. టీఎంసీ అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ తరఫున మిలన్ ప్రధాన్ పోటీ చేస్తున్నారు. మరో టీఎంసీ వర్గం మొహమ్మద్ ఇతేషాముల్ హక్‌ను బరిలోకి దించింది. సీపీఐ తరఫున శాంతిగోపాల్ గిరి పోటీ చేస్తున్నారు.
రేజీనగర్‌లో బీజేపీ తరఫున సఖారవ్ సర్కార్, సీపీఐ(ఎం) తరఫున సయ్యద్ అసద్ అలీ పోటీ చేస్తున్నారు. టీఎంసీ ఒక వర్గం రబియుల్ ఆలం చౌదరిని, మరో వర్గం సఫియుజ్జమాన్ షేక్‌ను బరిలోకి దించింది. కాంగ్రెస్ తరఫున మొహమ్మద్ అబ్దుల్లాహిల్ కాఫీ పోటీ చేస్తున్నారు.
విజయ్‌కు తొలి పరీక్ష
తమిళనాడులో మదురాంతకం, ధారాపురం ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు తొలి ప్రధాన ఎన్నికల పరీక్షగా నిలవనున్నాయి. మదురాంతకంలో 27 మంది, ధారాపురంలో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు మరగతం కుమారవేల్, పి. సత్యబామ రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అనంతరం వారిద్దరూ టీవీకేలో చేరి, ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
నాగావ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ
అసోంలోని నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నిక కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్దొలోయ్ రాజీనామా చేయడంతో అనివార్యమైంది. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. నాగావ్ స్థానాన్ని 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. ఈసారి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శివమోని బోరాను, బీజేపీ దేవాశిష్ శర్మను అభ్యర్థులుగా నిలబెట్టాయి. ఏఐయూడీఎఫ్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ కూడా పోటీలో ఉన్నారు. మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

