Uttarkashi cloudburst viral videos: ఉత్తరాఖండ్ల్ లోని ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదలు ఆ రాష్ట్రానికి భారీ నష్టాన్నే మిగుల్చాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా తలెత్తిన వరదలు ఏకంగా ఓ గ్రామాన్నే మింగేశాయి. ధారాలి గ్రామంలో భారీగా ప్రాణ నష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ వరదల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ ఆకస్మిక వరదలకు ఓ సైనిక శిబిరం కుడా తీవ్రంగా దెబ్బతింది. సుమారు 11 మంది సైనికులు గల్లంతైనట్లు సమాచారం. హర్షిల్ ప్రాంతంలోని క్యాంపులో ఉన్న సోల్జర్స్ కనిపించడం లేదని అధికారి వర్గాలు ధృవీకరించాయి. ఈ ఘటనకు సంబంధించిన హృదయ విధారకర దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
ఖీర్ గంగా నది పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగానే ఈ వరదల సంభవించినట్లు తెలుస్తోంది. ఈ వరదలకు ధారాలి గ్రామం సగంకు పైగా తుడుచుపెట్టుకుపోయింది. 130 మందిని అధికారులు రక్షించారు. ధారాలి గ్రామం గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉండటంతో ఇక్కడ పదుల సంఖ్యలో హోటల్లు, రెస్టారెంట్లు వెలిశాయి. తాజాగా దుర్ఘటనలో 25 వరకు హోటల్లు, గెస్ట్ హౌస్లు ధ్వంసమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల కోసం కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీకి చెందిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ ఎంఐ-17, చినూక్ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది.
తాజా ఘటనపై ప్రధాని మోదీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని ప్రధాని మోదీ అన్నారు. ఆ రాష్ట్ర సీఎంతో హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు ధరాలీకి సమీపంలోని ఖీర్ గంగాలో భారీగా నీరు నిలిచి.. ఒక్కసారిగా దిగువకు పోటెత్తినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే దీనిని అధికారులు ధృవీకరించలేదు.
Also read: Uttarakhand – ఉత్తరకాశిలో భారీ క్లౌడ్ బరస్ట్..50 మంది గల్లంతు.. భయానక వీడియో వైరల్!


