Nimisha Priya case update: యెమెన్‌లో మరణశిక్షకు గురైన కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ కేసు చుట్టూ ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా, భారత విదేశాంగ శాఖ ఈ వ్యవహారాన్ని చాలా సున్నితమైన అంశంగా పేర్కొంటూ, సంబంధిత మంత్రిత్వ శాఖ తరపున విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు.
‘‘ఈ కేసును కేంద్ర ప్రభుత్వం గమనిస్తోంది. నిమిష ప్రియ కుటుంబానికి అన్ని విధాలుగా మద్దతు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆమె తరపున న్యాయవాదిని నియమించాం. స్థానిక అధికారులు, బాధితుల కుటుంబ సభ్యులతో తగిన మంతనాలు జరుపుతున్నాం. అదే సమయంలో వివిధ మిత్ర దేశాలతోనూ సంప్రదింపులు కొనసాగిస్తున్నాం,’’ అని జైశ్వాల్ తెలిపారు.
కాగా కేరళకు చెందిన నిమిష ప్రియపై యెమెన్ నివాసితుడైన తలాల్ అదీబ్ మెహది హత్య కేసులో కోర్టు మరణశిక్ష విధించింది. ఇది జూలై 16న అమలవ్వాల్సి ఉండగా, భారత ప్రభుత్వం జరిపిన అనేక ప్రయత్నాల ఫలితంగా శిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. బాధిత కుటుంబంతో సయోధ్యకు వచ్చినంత వరకు మరింత సమయం ఇవ్వాలని భారతదేశం యెమెన్‌ను కోరింది. నిమిష ప్రియ ప్రాణాలు కాపాడేందుకు బ్లడ్‌మనీ (క్షమాధనం) చెల్లించే దిశగా ఆమె కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. వారు బాధిత కుటుంబానికి సుమారు ఒక మిలియన్ డాలర్లు (సుమారు ₹8.6 కోట్లు) చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈ మొత్తాన్ని తీసుకుని కేసు ముగించేందుకు మత పెద్ద కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ మధ్యవర్తిత్వం చేస్తున్నారు.
అయితే, మృతుడి సోదరుడు ఇప్పటికే మీడియా ద్వారా స్పందిస్తూ, “మానవ ప్రాణానికి డబ్బుతో విలువ నిర్ణయించలేం. న్యాయం జరగాలి. ఆమెకు శిక్ష తప్పక అమలవ్వాలి” అని స్పష్టం చేశారు. దీంతో సయోధ్య ప్రక్రియపై అనుమానాలు నెలకొన్నాయి. నిమిష ప్రియ కేసు కేవలం ఒక వ్యక్తిగత న్యాయపోరాటంగా కాక, విదేశాల్లో ఉద్యోగ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న భారతీయుల సమస్యలపై దృష్టి వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆమె ప్రాణాలను కాపాడే ప్రయత్నాలు, బ్లడ్‌మనీ వ్యవహారంలో జరిగే చర్చలు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి.


