Rs 500-Crore Andaman & Nicobar Bank Fraud: అండమాన్ నికోబార్ దీవుల్లో సంచలనం సృష్టించిన రూ. 500 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక అరెస్టులు చేసింది. ఈ కేసులో అండమాన్ మాజీ ఎంపీ (Member of Parliament) మరియు అండమాన్ అండ్ నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (ANSCBL) మాజీ ఛైర్మన్ అయిన కుల్‌దీప్ రాయ్ శర్మతో సహా ముగ్గురిని ED అరెస్టు చేసింది.
వందకు పైగా షెల్ కంపెనీలు:
అండమాన్ నికోబార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ED ఈ దర్యాప్తు చేపట్టింది. ED దర్యాప్తు ప్రకారం, మాజీ ఎంపీ శర్మ నేతృత్వంలో బ్యాంకు అధికారులు వందకు పైగా షెల్ కంపెనీలను (బూటకపు సంస్థలను) సృష్టించారు. బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఈ కంపెనీల ద్వారా రూ. 500 కోట్లకు పైగా రుణాలను అక్రమంగా మంజూరు చేశారు.
ALSO READ: Life Imprisonment: యూపీలో వీధి కుక్కలపై కఠిన నిబంధనలు.. రెండు సార్లు కరిస్తే జీవతఖైదే..!
ఈ రుణాల నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దారి మళ్లించారని ED పేర్కొంది. సుమారు రూ. 230 కోట్లు కేవలం కుల్‌దీప్ రాయ్ శర్మ మరియు ఆయన సన్నిహితుల లబ్ధి కోసమే మళ్లాయని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. మురుగన్, కళైవానన్‌లు తమ బంధువుల పేర్ల మీద రుణాలు తీసుకున్నారని, అలాగే ఇతరులకు రుణాలు మంజూరు చేయడానికి 5 శాతం కమీషన్ను నగదు రూపంలో వసూలు చేశారని లేదా షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని ఆధారాలు ఉన్నట్లు ED తెలిపింది.
నిధుల దారి మళ్లింపును మరింతగా గుర్తించేందుకు అండమాన్ నికోబార్ దీవుల్లోని మూడు ప్రాంతాల్లో ED సోదాలు కొనసాగిస్తోంది. పెద్ద మొత్తంలో నగదు రూపంలో డబ్బు విత్‌డ్రా చేసినట్లు ED అనుమానిస్తోంది.


