Former Vice President Benefits India: దేశ రెండో అత్యున్నత పీఠాన్ని అనూహ్యంగా వీడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు జగదీప్ ధన్‌ఖడ్. ఆరోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించినా, ఆయన పదవీకాలం మరో మూడేళ్లు మిగిలి ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే, ఆయన పదవికి దూరమైనా, రాజ్యాంగం ఆయనకు కల్పించే ప్రయోజనాలు, సౌకర్యాలు మాత్రం దూరం కావు. అసలు, దేశ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారికి పదవీ విరమణ తర్వాత ఎలాంటి గౌరవం, సౌకర్యాలు లభిస్తాయి..? వారికి అందే పింఛను ఎంత..? బంగ్లా, ఇతర భత్యాల వివరాలేంటి..?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో, మాజీ ఉపరాష్ట్రపతిగా ఆయనకు లభించే జీతభత్యాలు, సౌకర్యాలపై ఆసక్తి నెలకొంది. భారత ఉపరాష్ట్రపతుల (జీతభత్యాలు, పింఛను) చట్టం ప్రకారం, పదవిని వీడిన తర్వాత కూడా వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది.
పింఛను ఎంత:
ఉపరాష్ట్రపతిగా కనీసం రెండు సంవత్సరాలు పనిచేసిన వారు పదవీ విరమణ లేదా రాజీనామా చేసిన తర్వాత పింఛను పొందడానికి అర్హులు. జగదీప్ ధన్‌ఖడ్ ఈ నిబంధన పరిధిలోకి వస్తారు. 2018 బడ్జెట్ ప్రకారం, భారత ఉపరాష్ట్రపతి వేతనం నెలకు రూ. 4 లక్షలు (సంవత్సరానికి రూ. 48 లక్షలు). మాజీ ఉపరాష్ట్రపతికి, వారి వేతనంలో 50% నుంచి 60% వరకు పింఛనుగా లభిస్తుంది. ఈ లెక్కన, జగదీప్ ధన్‌ఖడ్‌కు నెలకు సుమారు రూ. 2 లక్షల కంటే ఎక్కువ పింఛను అందుతుంది.
బంగ్లా, ఇతర సౌకర్యాలు: పింఛనుతో పాటు, మాజీ ఉపరాష్ట్రపతికి ప్రభుత్వం అనేక ఇతర సౌకర్యాలను కల్పిస్తుంది.
నివాసం: దిల్లీలోని అత్యంత కీలకమైన ప్రాంతంలో, సాధారణంగా సీనియర్ కేంద్ర మంత్రులు లేదా జాతీయ పార్టీల అధ్యక్షులకు కేటాయించే ‘టైప్-8’ ప్రభుత్వ బంగ్లాను కేటాయిస్తారు. ఈ బంగ్లాకు అయ్యే విద్యుత్, నీటి బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ప్రయాణాలు: జీవితాంతం తమ జీవిత భాగస్వామితో కలిసి దేశంలో ఎక్కడికైనా విమానం లేదా రైలులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉంటుంది.
వైద్యం: ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తారు. అంతేకాకుండా, వారి వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రైవేట్ వైద్యుడిని కూడా అందుబాటులో ఉంచుతారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/fake-embassy-ghaziabad-conman-arrested/
వ్యక్తిగత సిబ్బంది: ఇద్దరు వ్యక్తిగత సహాయకులను (PAs), వారి జీవిత భాగస్వామి కోసం ఒక ప్రైవేట్ కార్యదర్శిని ప్రభుత్వం నియమిస్తుంది.
ఇతర సౌకర్యాలు: బంగ్లాలో అవసరమైన ఫర్నిచర్, కొన్ని గృహోపకరణాలతో పాటు, రెండు మొబైల్ ఫోన్లను కూడా ప్రభుత్వం అందిస్తుంది.
కొత్త బంగ్లాలోకి ధన్‌ఖడ్:
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో, జగదీప్ ధన్‌ఖడ్ ప్రస్తుతం ఉంటున్న కొత్త వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌ను త్వరలోనే ఖాళీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన తన సామాగ్రిని సర్దుకోవడం ప్రారంభించినట్లు సమాచారం. త్వరలోనే పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆయనకు లుటియన్స్ దిల్లీలో లేదా మరో ప్రాంతంలో టైప్-8 బంగ్లాను కేటాయించనుంది.
కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు సన్నాహాలు:
మరోవైపు, ధన్‌ఖడ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం (EC) సన్నాహాలు ప్రారంభించింది. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా జరిగే ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.


