దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించిన విషయం అందరికీ తెలిసిందే. సోమవారం ఉదయం 5:36 నిమిషాల సమయంలో 4.0 తీవ్రతతో భూమి కంపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ భూకంప తీవ్రత ఢిల్లీ పరిసరాల్లోని నొయిడా, ఘాజియాబాద్‌లను సైతం తాకింది. అదృష్టవశాత్తు, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో దేశ రాజధాని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దేశ రాజధాని ఢిల్లీకి భూకంపాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలాసార్లు భూకంపం వచ్చింది. నేపాల్‌లోని ఖాట్మండులో భూకంపం వచ్చినప్పుడు దాని ప్రభావం ఢిల్లీపై కూడా పడింది.
ఢిల్లీలో తరచూ భూకంపాలకు కారణం: దేశ రాజధానిలో తరచూ భూమి కంపించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. భౌగోళికంగా చూస్తే.. హిమాలయ పర్వతాలకు దగ్గరగా దేశ రాజధాని ఉంటుంది. ఇండియా సిస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం.. ఢిల్లీ ప్రాంతం నాలుగో సిస్మిక్ జోన్‌లో ఉంది. అంటే జోన్ IV లో ఉన్న ప్రాంతాల్లో భూంకపాలు మధ్యస్థం నుంచి ఎక్కువ ప్రమాద తీవ్రతతో వచ్చే అవకాశంం ఉంది. హిమాలయ పర్వతాల్లో భూకంపాలు సంభవించడమే ఇందుకు ప్రధాన కారణమని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) వెల్లడించింది.
ఢిల్లీలో తరచూ భూకంపాలు సంభవించడానికి మరోకారణం ప్రధాన భౌగోళిక నిర్మాణాలైన ఢిల్లీ- హరిద్వార్ పర్వత శ్రేణి, ఢిల్లీ మొరాదాబాద్ లోయలు అయి ఉండొచ్చని DDMA తెలిపింది. వీటి మధ్య ఢిల్లీ వ్యాపించి ఉండటంతో అవి 30 కిలోమీటర్ల లోతులో భూకంపాన్ని కల్పిస్తాయి. అయితే ఢిల్లీ జోన్ IVలో ఉన్నందున అత్యంత ప్రమాదకర తీవ్రతతో భూకంపాలు రావని చెబుతున్నారు. హస్తినలో 4 లేదా 5 మ్యాగ్నిట్యూడ్‌తోనే భూకంపాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే చరిత్ర చూస్తే క్రీ.శ. 1720 నుంచి ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో 5.5 నుంచి 6.7 తీవ్రత మధ్య 5 సార్లు భూకంపాలు సంభవించాయి. కాబట్టి చాలా అరుదుగా మాత్రమే 7-8 తీవ్రతతో భూకంపాలు రావచ్చని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో 7 తీవ్రతతో భూమి కంపించినా ఆశ్చర్యం అవసరం లేదు. దీంతో ఢిల్లీ ఎప్పుడూ హై రిస్క్ ఏరియాలోనే ఉంటుంది.
భూకంపం ఎందుకు వస్తుంది: భూకంపం భూమిలోని భౌగోళిక ప్రక్రియల కారణంగా సంభవిస్తుంది. ఇది భూమి అంతర్భాగంలో ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల లేదా భూమిలో ఉన్న ఒత్తిళ్లు విడుదల కావడంతో సంభవిస్తుంది. భూమి ఉపరితలం అనేక ప్లేట్లుగా విభజించబడి ఉంటుంది. ఇవి కదలికలో ఉంటాయి. ఒక ప్లేట్ మరొక ప్లేట్‌ను గట్టిగా నెట్టినప్పుడు లేదా ఒకదానిపైకి మరొకటి ఎక్కినప్పుడు భూకంపం వస్తుంది. భూమి తీవ్రంగా కంపించినప్పుడు కొండచరియలు విరిగిపడటం, వరదలు, సునామీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక భూకంపం ప్రారంభమైన ప్రదేశాన్ని భూకంప కేంద్రం అంటారు. ఇక్కడ ప్రకంపనలు చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే క్రమంగా ఈ ప్రకంపనలు భూమి పైకి వస్తుంటాయి. భూకంపం కేంద్రం ఎంత లోతులో ఉంటే అంత తక్కువ తీవ్రత నమోదవుతుంది.
భూకంప తీవ్రతను రిచ్టర్ స్కేల్ (Richter Scale) ద్వారా కొలుస్తారు. 3.0 నుంచి 4.0 స్వల్ప భూకంపం, పెద్దగా ప్రభావం ఉండదు. 5.0 నుండి 6.0 మధ్యస్థాయి భూకంపం, కొన్ని భవనాలు దెబ్బతింటాయి.
7.0 నుంచి 8.0 తీవ్రమైన భూకంపం, భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. 8.0 తీవ్రతతో వచ్చే భూకంపం అత్యంత ధ్వంసకరమైన భూకంపం, పెద్ద భవనాలు నేలమట్టం చేస్తుంది. ఇక భూకంప ప్రభావంతో భవనాలు, రహదారులు దెబ్బతినడం, ప్రాణ నష్టం సునామీలు సంభవిస్తుంటాయి.
భూకంపాలను ఎలా నివారించాలి/ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి : భూకంపాలు పూర్తిగా నివారించలేము.. అయితే ముందుగా కొన్ని సూచనలు తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. ఇక భూకంప నిరోధక భవన నిర్మాణాలు చేపట్టాలి. భూకంప ప్రబల ప్రాంతాల్లో మానవ చర్యలను నియంత్రించాలి. భూకంపాలు సహజసిద్ధమైన ప్రక్రియ అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టం తగ్గించుకోవచ్చు. భూకంపం సమయంలో టేబుల్ లేదా గట్టి వస్తువు కింద తల దాచుకోవాలి. తల మరియు మెడ రక్షించుకోవాలి. బయట ఉంటే తెరుచుకొన్న ప్రదేశంలో ఉండాలి, భవనాల నుండి దూరంగా ఉండాలి. పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉండేవారు.. లిఫ్ట్ అస్సలు ఉపయోగించుకోకూడదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండటం ఒకటే మార్గం.