Nitin Gadkari’s response to US tariffs : అగ్రరాజ్యం అమెరికా సుంకాల కత్తి దూస్తుంటే… భారత్ తలవంచుతుందా? లేక తిరగబడుతుందా? భారత దిగుమతులపై అదనపు బాదుడుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వేళ, దేశం మొత్తం దీనిపై ప్రభుత్వ స్పందన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ‘దాదాగిరీ’ చేసేది ఆర్థికంగా బలమున్న వాళ్లేనని, కానీ మా సంస్కృతి అది కాదంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
సుంకాల బాదుడు.. ట్రంప్ ‘ఆర్డర్’ : భారత వాణిజ్యానికి గట్టి షాక్ ఇస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఓ కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీని ప్రకారం, భారత్ నుంచి వచ్చే దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ భద్రత, విదేశాంగ విధానపరమైన ఆందోళనలే ఈ నిర్ణయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవడం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అమెరికాకు “అసాధారణమైన ముప్పు” కలిగిస్తోందని ఆరోపించారు. అయితే, ట్రంప్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా “అన్యాయం, అసమంజసమైనది” అని, ఎవరి బెదిరింపులకూ తలవంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
‘దాదాగిరీ’పై గడ్కరీ గట్టి కౌంటర్ : ఈ పరిణామాలపై నాగ్‌పుర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VNIT)లో ప్రసంగిస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా స్పందించారు. “మన ఎగుమతులు, ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ‘దాదాగిరీ’ చేస్తున్న వారు ఆర్థికంగా, సాంకేతికంగా బలంగా ఉన్నారు కాబట్టే అలా ప్రవర్తిస్తున్నారు,” అంటూ పరోక్షంగా అమెరికాకు చురకలంటించారు. “మేం ఆర్థికంగా బలపడినా, టెక్నాలజీలో ముందున్నా ఎవరినీ బెదిరించం. ఎందుకంటే అది మా సంస్కృతిలో లేదు. ‘విశ్వ సంక్షేమం’ అనేది మా సంస్కృతి మాకు నేర్పిన పాఠం” అని గడ్కరీ ఉద్ఘాటించారు.
స్వావలంబనే అసలైన సమాధానం : ఇలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ఆర్థిక స్వావలంబనే అసలైన మార్గమని గడ్కరీ నొక్కిచెప్పారు. “ప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కారం సైన్స్, టెక్నాలజీ, జ్ఞానంలోనే ఉంది. ఈ మూడింటినీ మనం సరిగ్గా ఉపయోగించుకుంటే, ఎప్పటికీ ప్రపంచానికి తలవంచాల్సిన అవసరం రాదు,” అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐఐటీలు, పరిశోధనా కేంద్రాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా నిరంతరం పనిచేస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మూడు రెట్లు పెరుగుతుందని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు.


