Gen Z bhajan clubbing trend : భజనలంటే మనకు గుర్తొచ్చేది గుడి ప్రాంగణాలు, వయసు మళ్లిన వారు, నెమ్మదిగా సాగే సంప్రదాయ సంగీతం. కానీ, డిమ్ లైట్లు, మోడ్రన్ బీట్లు, ఉత్సాహంగా కేరింతలు కొట్టే యువతరం మధ్య భజనలు హోరెత్తిస్తే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా, ఇదే ఇప్పుడు దేశంలోని మెట్రో నగరాల్లో సరికొత్త ట్రెండ్. దీని పేరే ‘భజన క్లబ్బింగ్’. అసలేమిటీ ఈ భజన క్లబ్బింగ్? పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిందనుకునే జెన్-జీ తరం, ఒక్కసారిగా భజనల వైపు ఎందుకు మళ్లుతోంది? ఆధ్యాత్మికతకు వారు ఇస్తున్న ఈ కొత్త నిర్వచనం ఏమిటి?
ఆధునిక జీవనశైలిలో ఆధ్యాత్మికతకు చోటు లేదనే వాదనను పటాపంచలు చేస్తూ, నేటి తరం యువత (జెన్-జీ) తమదైన శైలిలో భక్తి మార్గాన్ని పునర్నిర్వచిస్తోంది. సంప్రదాయ భజనలకు ఆధునిక సంగీతాన్ని జోడించి, సరికొత్త అనుభూతిని పంచుతోంది. ముంబై, కోల్‌కతా వంటి మహానగరాల్లో ఈ ‘భజన క్లబ్బింగ్’ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది.
ఏమిటీ ‘భజన క్లబ్బింగ్’..
నూతన రూపం: ‘భజన క్లబ్బింగ్’ అంటే, క్లబ్‌లు లేదా కేఫ్‌ల వంటి సౌకర్యవంతమైన, తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాలలో భక్తితో కూడిన సమావేశాలను నిర్వహించడం. ఇక్కడ సంప్రదాయ భజన కీర్తనలను ఆధునిక సంగీత వాయిద్యాలు, పాశ్చాత్య బీట్స్‌తో మిళితం చేసి ఆలపిస్తారు.
యువతే నిర్వాహకులు: ఈ కార్యక్రమాలను యువత బృందాలే స్వయంగా నిర్వహిస్తున్నాయి. వీరు తమ వయసు వారికి నచ్చే విధంగా, కఠినమైన నియమ నిబంధనలు లేకుండా స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
ఆధ్యాత్మికతకు కొత్త అర్థం: ఈ ట్రెండ్ ద్వారా యువత భక్తిని ఒక గంభీరమైన లేదా విసుగు పుట్టించే ప్రక్రియగా కాకుండా, మూడు ముఖ్యమైన అంశాలుగా చూస్తోంది:
వినోదం (Fun): సంగీతం, లయల ద్వారా భగవంతుడిని స్మరించుకోవడాన్ని ఒక ఆనందకరమైన వేడుకగా మార్చడం.
సామాజికం (Social): ఒకే రకమైన ఆలోచనలున్న యువత ఒకచోట చేరి, సానుకూల దృక్పథంతో బంధాలను పెంచుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతోంది.
అనుబంధం (Relatable): సంప్రదాయ కీర్తనలకు ఆధునిక సంగీతాన్ని జోడించడం వల్ల, అవి యువతకు సులభంగా కనెక్ట్ అవుతున్నాయి. గుడిలో ఉండే గంభీర వాతావరణానికి బదులుగా, ఇక్కడి స్వేచ్ఛాయుత వాతావరణం వారిని మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ సమావేశాలు నేటి యువతరం భక్తిని, దైవచింతనను ఎంత సరదాగా, సామాజికంగా, మరియు తమ జీవితంలో భాగం చేసుకునేలా మార్చుకుంటుందో చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ.


