HomeTop Storiesకొరియన్‌ కథల నుంచి కబీర్‌ కవిత్వం వరకు.. జెన్‌ జీ కొత్త పఠనాభిరుచులు

కొరియన్‌ కథల నుంచి కబీర్‌ కవిత్వం వరకు.. జెన్‌ జీ కొత్త పఠనాభిరుచులు

న్యూఢిల్లీ, నవంబర్ 4 (తెలుగుప్రభ) : జెన్‌ జీ యువత పుస్తక పఠన అభిరుచుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొరియన్‌ కథా సాహిత్యం నుంచి కబీర్‌ కవిత్వం వరకు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచనల నుంచి ఓషో పుస్తకాల వరకు విభిన్న సాహిత్యంపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గుర్తింపు, అస్తిత్వం, సమకాలీన సామాజిక సమస్యల ఇతివృత్తాలతో కూడిన రచనలకు ఆదరణ పెరుగుతోందని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ (ఎన్‌బీటీ) అంతర్గత నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన 53వ న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శనను సందర్శించి పుస్తకాలు కొనుగోలు చేసిన 3,600 మందికి పైగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.

- Advertisement -

మానసిక ఉత్కంఠ కలిగించే ‘ది సైలెంట్‌ పేషెంట్‌’, ‘ఎల్లోఫేస్‌’ నవలలతో పాటు కొరియన్‌ రచనలు ‘ది వెజిటేరియన్‌’, ‘కర్డ్స్ బన్నీ’, జపనీస్‌ పుస్తకాలు ‘బిఫోర్‌ ద కాఫీ గెట్స్‌ కోల్డ్‌’, ‘డేస్‌ ఎట్‌ ద మోరిసాకి బుక్‌షాప్‌’కు యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కబీర్‌ కవిత్వం, అంబేడ్కర్‌, ఓషో రచనలు, భారత రాజ్యాంగ అనువాద ప్రతులపైనా ఆసక్తి కనిపిస్తోంది. ఫాంటసీ, ఊహాజనిత సాహిత్యం కూడా విద్యా సంబంధిత పుస్తకాలకు భిన్నంగా వినోదాన్ని అందిస్తూ యువ పాఠకులను ఆకర్షిస్తోంది. ప్రదర్శనకు వచ్చిన మొత్తం సందర్శకుల కొనుగోళ్లను అంచనా వేయగా సుమారు రూ.323 కోట్ల విలువైన పుస్తకాలు అమ్ముడైనట్లు ఎన్‌బీటీ వెల్లడించింది. ఒక్కో సందర్శకుడు సగటున రూ.1,615.80 ఖర్చు చేసినట్లు తెలిపింది. జనవరి 10 నుంచి 18 వరకు భారత్‌ మండపంలో జరిగిన ఈ ప్రదర్శనలో 352 ఆంగ్ల, 150కి పైగా హిందీ ప్రచురణ సంస్థలతో పాటు ఉర్దూ, ప్రాంతీయ భాషల ప్రచురణకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News