Prime Minister Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ప్రధాని ఈ దేశంలో తన పర్యటనను కొనసాగించనున్నారు. నిన్న ప్రారంభమైన ఈ పర్యటన నేటితో ముగియనుంది. గత మూడున్నర దశాబ్దాల్లో భారతదేశ ప్రధాన మంత్రి ఘనా భూమిని అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఈ పర్యటన భారత-ఘనా సంబంధాల్లో ఒక మైలురాయిగా గుర్తింపు పొందుతోంది. మోదీ ఘనా రాజధాని అక్రాలోకి చేరుకున్న వెంటనే, ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామని మహామా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి, 21 తుపాకీ గౌరవ వందనంతో పాటు, ఉత్సవకరమైన ఆతిథ్యంతో స్వాగతం పలికారు.
అక్రాలోని ఓ హోటల్ వద్ద అక్కడి భారతీయులు “భారత్ మాతా కీ జై”, “హరే రామ, హరే కృష్ణ” నినాదాలతో మోదీకి ఉత్సాహంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ, అధ్యక్షుడు మహామాతో జూబ్లీ హౌస్‌లో జరిగిన భేటీలో ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలపై సమగ్ర చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇంధన భద్రత, ఆరోగ్య పరిరక్షణ, పెట్టుబడి, సంస్కృతి, సంప్రదాయ వైద్యం, సామర్థ్యాభివృద్ధి వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసారు. రెండు దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయాలని సంకల్పించాయి. ప్రస్తుతం ఇది 3.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఈ పర్యటనలో భాగంగా మోదీకి ఘన దేశం అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ను ఘనా ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ పురస్కారం ద్వారా ఆయన నాయకత్వ నైపుణ్యాలకు, గ్లోబల్ దక్షిణ దేశాలతో అభివృద్ధి భాగస్వామ్యానికి చేసిన కృషికి ఘనత చెల్లించారు. ఈ గౌరవాన్ని అందుకుంటూ మోదీ, “ఈ పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితం” అని తెలిపారు. అంతేకాదు, G20 వేదికపై ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ తీసుకున్న ముందడుగు అని గుర్తుచేశారు.
నేడు మోదీ ఘనా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది అక్కడ ప్రసంగించే మొదటి భారత ప్రధాని ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సందర్భంగా బ్లాక్ స్టార్ స్క్వేర్ సందర్శన, భారతీయ డయాస్పొరాతో సమావేశాలు, వారితో అనుసంధాన కార్యక్రమాలు మోదీ పర్యటనలో భాగమవుతాయి. ఇది భారత్-ఆఫ్రికా సంబంధాల విస్తరణలో ఒక కీలకమైన మలుపుగా భావిస్తున్నారు. ఘనా పర్యటన ముగిసిన తరువాత, మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన BRICS సమ్మిట్ వరకు కొనసాగనుంది. జూలై 9న ఆయన పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటన భారత్ గ్లోబల్ సౌత్‌తో బంధాలను బలోపేతం చేయడంలో ఒక కీలకమైన ఘట్టంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.