Saturday, November 15, 2025
Homeనేషనల్Ghost Village : దెయ్యాల దిబ్బ.. నెత్తుటి కథ.. ఆ ఊరిలో మిగిలింది ఒకే ఒక్కడు!

Ghost Village : దెయ్యాల దిబ్బ.. నెత్తుటి కథ.. ఆ ఊరిలో మిగిలింది ఒకే ఒక్కడు!

Tamil Nadu ghost village : ఒకప్పుడు జనసంద్రంతో కళకళలాడిన పల్లె.. ఇప్పుడు నిశ్శబ్దంతో నిండిన దెయ్యాల దిబ్బ. ఏ వీధిలో చూసినా తాళం వేసిన ఇళ్లే.. ఏ గడపలో చూసినా అలుముకున్న శూన్యమే. కానీ, ఆ నిర్మానుష్య గ్రామంలో పొడవాటి జడలతో ఓ వృద్ధుడు ఒంటరిగా పోరాడుతున్నాడు. అసలు తమిళనాడులోని నట్టకుడి అనే ఆ గ్రామానికి ఈ గతి ఎందుకు పట్టింది..? కొబ్బరి తోటలోని ఆ రక్తపు మరకల వెనుక దాగి ఉన్న కథేంటి..? వరుస హత్యలు ఆ ఊరిని ఎలా భయకంపితుల్ని చేశాయి..? ప్రాణభయంతో ఊరు విడిచిన జనం ఏమయ్యారు..? ఆ ఒంటరి పోరాట యోధుడి మాటల్లోనే ఆ భయానక వాస్తవాలు.

తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఉంది నట్టకుడి గ్రామం. “అది స్వర్గమే అయినా సొంత ఇల్లులా ఉంటుందా..?” అనే సూక్తి ఊరి ముఖద్వారం వద్ద దర్శనమిస్తుంది. కానీ నేడు ఆ ఊరు స్వర్గానికి కాదు, నరకానికి నిలువుటద్దంలా మారింది. ఊరంతా నిర్మానుష్యం.. పూజలకు నోచుకోని అయ్యనార్ ఆలయం.. తాళాలు వేలాడుతున్న ఇళ్లు.. ఈ భయానక వాతావరణంలో కాషాయ వస్త్రాలు, జడలు కట్టిన జుట్టుతో అకస్మాత్తుగా ఎదురొచ్చారు తంగరాజన్. “భయపడకండి.. రండి. నేను తంగరాజన్‌ని. ఈ ఊరిలో నాలుగో తరం నాది. అందరూ వెళ్లిపోయారు.. కానీ కన్న ఊరిని ఎలా వదులుకోగలను..?” అంటూ తన కథను ప్రారంభించారు ఓ పెద్దాయన.

- Advertisement -

రెండు హత్యలు.. చెదిరిన బతుకులు: ఒకప్పుడు సుమారు 50 కుటుంబాలతో నట్టకుడి ప్రశాంతంగా ఉండేది. 2023లో గ్రామపెద్దగా ఉన్న గణేశన్, ఊరి ప్రజలకు అన్నీ తానై చూసుకునేవాడు. వృద్ధులకు సపర్యలు చేస్తూ, చిన్న దుకాణం నడుపుతూ వారికి అండగా నిలిచాడు.

మొదటి హత్య: గత ఏడాది నవంబర్‌లో, గణేశన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి ఎదుటే కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనతో ఊరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

రెండో హత్య: ఆ షాక్ నుంచి తేరుకోకముందే, గణేశన్ తర్వాత ఊరికి సాయం చేస్తున్న సోనై అనే బధిరుడు (చెవిటి-మూగ) కూడా ఈ ఏడాది జూలై 20న అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. ఊరి శివారులోని కొబ్బరి తోటలో అతని రక్తపు మరకలు గ్రామస్థుల గుండెల్లో భయాన్ని నాటాయి.

భద్రతేది.. బతుకేది: ఈ వరుస హత్యలతో గ్రామస్థులు భయంతో వణికిపోయారు. “గణేశన్, సోనై లాంటి వాళ్లకే రక్షణ లేనప్పుడు మా పరిస్థితేంటి..?” అనే ఆందోళన వారిని వెంటాడింది. సరైన పోలీసు భద్రత లేకపోవడంతో, ఉన్న కొద్దిపాటి కుటుంబాలు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఊరు విడిచి వెళ్లిపోయాయి. “20 రోజుల క్రితం కూడా ఇక్కడ 20 కుటుంబాలు ఉండేవి. పోలీసు భద్రత లేదనే వారంతా వెళ్లిపోయారు,” అని తంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల రాక.. తంగరాజన్ నిలదీత: ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న జిల్లా అధికారులు నట్టకుడికి చేరుకున్నారు. ప్రజలను తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కానీ తంగరాజన్ వారిని నిలదీశారు. “రోడ్లు, కరెంటు ఉన్నాయి సరే.. రక్షణ ఏది సారూ? ఏదైనా జరిగితే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీయాలా..?” అని ఆయన ప్రశ్నించడం అక్కడి నిస్సహాయ పరిస్థితికి అద్దం పట్టింది.

కన్నీళ్లతో మహిళల వేడుకోలు: నట్టకుడి నుంచి వలస వెళ్లిన మహిళలు సమీపంలోని ఇలంతకుడిలో ఉపాధిహామీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వారు తమ గోడును వివరిస్తూ కన్నీరుమున్నీరయ్యారు. “మేం బతకడానికి ఇక్కడికి వచ్చాం. దయచేసి మా గ్రామంలో పోలీసు రక్షణ కల్పించండి. ఈ హత్యలు ఆపండి. అంతకుమించి మేం ఇంకేమీ కోరడం లేదు,” అని చేతులు జోడించి వేడుకున్నారు.

మీడియా కథనాలతో స్పందించిన జిల్లా ఎస్పీ, నట్టకుడిలో ఇద్దరు పోలీసు సిబ్బందితో తాత్కాలికంగా భద్రత ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసి తంగరాజన్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. “కనీసం ఇప్పుడైనా నా ఊరి జనం తిరిగి వస్తారు” అనే ఆశతో ఆ ఒంటరి యోధుడు ఎదురుచూస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad