HomeTop StoriesLPG shortage: గ్యాస్ కొరతతో గజిబిజీ.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్

LPG shortage: గ్యాస్ కొరతతో గజిబిజీ.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్

Fuel price rise:ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ప్రభావం క్రమంగా తీవ్రంగా మారుతోంది. కొన్ని దేశాల్లో పరిస్థితి మరింత కఠినంగా మారడంతో ప్రభుత్వాలు విద్యాసంస్థలు మూసివేయడం, ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ పరిణామాలు క్రమంగా సాధారణ ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతున్నాయి.

- Advertisement -

విద్యాసంస్థలకు సెలవులు …

ఆసియా, యూరప్ ప్రాంతాల్లో కొన్ని దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని దేశాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం ద్వారా విద్యార్థుల రాకపోకలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలను అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని సూచనలు కూడా ఇస్తున్నారు.

ఇంధన కొరత ప్రభావం రెస్టారెంట్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని అనేక నగరాల్లో చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు సులభంగా లభించకపోవడం వల్ల కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ అందుబాటులో ఉన్నవారు మాత్రమే వ్యాపారం కొనసాగిస్తున్నారు. పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

Also Read:https://teluguprabha.net/national-news/indian-railways-may-suspend-train-catering-due-to-gas-shortage/

గ్యాస్ వినియోగం ఎక్కువగా …

హోటళ్లలో సాధారణంగా తయారయ్యే కొన్ని ఆహార పదార్థాలను కూడా తగ్గిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే వంటకాలను తయారు చేయడం తగ్గించడంతో వినియోగదారులకు ఎంపికలు కూడా తగ్గుతున్నాయి. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు మరియు ఉద్యోగులు కూడా ఈ పరిస్థితి వల్ల ఇబ్బందులు పడుతున్నారు. భోజన మెనూలు తగ్గించబడటంతో వారికి సరైన ఆహారం అందడం కష్టంగా మారుతోంది.

కొన్ని హోటళ్లు గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యులను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆధునిక వంటగదుల్లో పని చేసే చాలా మంది వంట మాస్టర్లకు ఆ విధంగా వంట చేయడం అలవాటు లేకపోవడం మరో సమస్యగా మారింది. హైదరాబాద్ లోని ప్రసిద్ధ హోటల్ సంస్థ అయిన పిస్తా హౌస్‌ నిర్వాహకులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. కట్టెలు, బొగ్గు ఉన్నప్పటికీ వాటితో వంట చేయడం సిబ్బందికి తెలియకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని వారు పేర్కొన్నారు.

అన్నప్రసాదం కార్యక్రమం…

ఇంధన కొరత ప్రభావం ఆలయాలపైనా పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిర్‌ ప్రాంతంలో భక్తులకు అందించే అన్నప్రసాదం కార్యక్రమం ఇప్పటికే నిలిపివేసినట్లు సమాచారం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతిలోమాత్రం పరిస్థితిని సమీక్షిస్తూ గ్యాస్ సరఫరా అంతరాయం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

యాప్ ఆధారిత క్యాబ్ సేవలతో పనిచేసే..

గ్యాస్ కొరత ప్రభావం రవాణా రంగంపై కూడా తీవ్రంగా పడుతోంది. గ్యాస్ ఆధారంగా నడిచే క్యాబ్ఆటో డ్రైవర్లు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఓలా,ఉబర్‌ వంటి యాప్ ఆధారిత క్యాబ్ సేవలతో పనిచేసే డ్రైవర్లు గ్యాస్ కోసం ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ధరలు కూడా పెరుగుతుండటంతో వారి ఆదాయం తగ్గిపోతుందని వారు చెబుతున్నారు.

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంపైనా ఈ ప్రభావం పడుతోంది. స్వీగ్గీ,జొమాటో వంటి సేవలపై ఆధారపడే గిగ్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లలో వంటలు తగ్గిపోవడంతో ఆర్డర్లు అందుబాటులో ఉన్నప్పటికీ డెలివరీ కోసం సరిపడా ఆహారం తయారు చేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో..

ఇంధన కొరత ప్రభావం విమాన ప్రయాణంపై కూడా పడుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో విమానాల్లో ఉపయోగించే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఖర్చు కూడా పెరిగింది. దీంతో విమాన సంస్థలు టికెట్ ధరలను పెంచడం ప్రారంభించాయి. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా తన దేశీయ మరియు అంతర్జాతీయ విమాన టికెట్ ధరలను పెంచినట్లు ప్రకటించింది. ఇతర ఎయిర్ లైన్స్ కూడా అదే మార్గంలో వెళ్లే అవకాశం ఉంది.

పరిశ్రమలపైనా ఈ సమస్య ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లో ఫినిష్డ్ స్టీల్ తయారీకి గ్యాస్ అవసరం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సరఫరా అంతరాయం కొనసాగితే ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Also Read:https://teluguprabha.net/national-news/eighth-central-pay-commission-process-begins-suggestions-invited/

మొత్తానికి గ్యాస్ కొరత ప్రభావం కేవలం ఇంధన రంగానికే పరిమితం కాకుండా ఆహార వ్యాపారం, రవాణా, విమాన ప్రయాణం, పరిశ్రమలు వంటి అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. దీని ప్రభావం చివరకు సాధారణ ప్రజల జీవన వ్యయాన్ని కూడా పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News