Global Hunger Index 2025 India rank : ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతున్నా, మానవాళిని వెన్నాడుతున్న అతిపెద్ద భూతం ‘ఆకలి’. పుడమిపై పండుతున్న పంటలు అందరి కడుపు నింపలేకపోతున్నాయి. తాజాగా విడుదలైన ‘ప్రపంచ ఆకలి సూచీ (Global Hunger Index) 2025’ నివేదిక, ఈ కఠోర వాస్తవాలను మరోసారి కళ్లకు కట్టింది. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 67.3 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఈ నివేదిక తేల్చిచెప్పింది. ఇంతటి తీవ్రమైన ప్రపంచ సంక్షోభంలో, అత్యధిక జనాభా కలిగిన మన దేశం ఎక్కడ నిలిచింది? మన పరిస్థితి మెరుగ్గా ఉందా లేక ఆందోళనకరంగా ఉందా? ఆ వివరాల్లోకి వెళ్తే..
భారత్‌కు 102వ ర్యాంకు.. ‘తీవ్ర’మైన విభాగంలో : ప్రపంచ ఆకలి సూచీ 2025 జాబితాలో, భారతదేశం 102వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. 25.8 స్కోరుతో భారత్‌లోని ఆకలి తీవ్రతను ‘తీవ్రమైన’ (Serious) కేటగిరీలో చేర్చారు. పోషకాహార లోపం, పిల్లలలో ఎదుగుదల లోపాలు, బరువు తక్కువగా ఉండటం వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ధారిస్తారు. ‘తీవ్రమైన’ కేటగిరీలో ఉండటం అంటే, దేశంలో ఆకలి, పోషకాహార లోపం సమస్యలను అధిగమించడానికి ఇంకా చాలా కృషి జరగాల్సి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
జాబితాలో అగ్రస్థానంలో ఆ దేశాలు : ఆకలితో అత్యధికంగా అల్లాడుతున్న దేశాల జాబితాలో ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాలే ఉన్నాయి. అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరత, వాతావరణ మార్పులతో సతమతమవుతున్న దేశాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. నివేదిక ప్రకారం, అత్యంత తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న దేశాలలో సోమాలియా, దక్షిణ సూడాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మడగాస్కర్, హైతీ, చాద్, నైజర్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజీరియా, పాపువా న్యూ గినియా మరియు సిరియా వంటి దేశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే, ఆకలి నిర్మూలనపై తక్షణమే దృష్టి సారించాలని, సమర్థవంతమైన విధానాలను అమలు చేయాలని ఈ నివేదిక నొక్కి చెబుతోంది.


