Bhushan Verma Theft Case: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. పటిష్టమైన భద్రత ఉండే ఎర్రకోటలో సుమారు రూ. 1.5 కోట్ల విలువైన బంగారు వస్తువులను ఓ దొంగ అపహరించాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు సోమవారం నిందితున్ని అరెస్టు చేశారు. నిందితుడు భూషణ్ వర్మను ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో జరిగిన జైన మతపరమైన పవిత్ర పండుగ ‘దశలక్షణ మహాపర్వ’ కార్యక్రమంలో భక్తుడి వేషంలో పాల్గొని సుమారు రూ.1.5 కోట్ల విలువైన బంగారు వస్తువులను అపహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. భూషణ్ వర్మ చోరీకి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజీకి చిక్కడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, జైన ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 3న భూషణ్ వర్మ భక్తుడి మాదిరిగా పంచెకట్టు ధరించి కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ పూజా కార్యక్రమానికి పలువురు ప్రముఖులు సైతం హాజరయ్యారు. నిర్వాహకులు వారిని ఆహ్వానించడాని వెళ్లిన సమయంలో భూషణ్ వర్మ కలశాలను ఎత్తుకెళ్లాడు.
పూజారి వేశంలో వచ్చి.. భక్తులను ఏమార్చి..
భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని పూజల కోసం ఉంచిన విలువైన వస్తువులను దొంగిలించాడు. పూజా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తర్వాత నిర్వాహకులు దొంగతనాన్ని గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. జైన పూజారి వేషంలో వచ్చిన వ్యక్తి పూజా సామగ్రి ఉన్న గదిలోకి వెళ్లి.. కలశాలను సంచిలో వేసుకొని వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. కాగా, నిందితుడు భూషణ్ వర్మ జైన మతస్థుడు కాదని, అతడిపై గతంలోనూ అనేక పోలీసు కేసులు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
#WATCH | Delhi: DCP North Delhi, Raja Banthia says, "This is the incident of 3rd September. The program of Jain community was going on. A pandal was set up there. A devotee had brought a golden Kalash, it has precious gems on it, so it was stolen. After that, we have also… https://t.co/fBC6irpAXI pic.twitter.com/IZH9rlGZuY
— ANI (@ANI) September 6, 2025
బంగారు కలశంతో పాటు వజ్రాలు సైతం..
భూషణ్ వర్మ దొంగిలించిన వస్తువుల్లో సుమారు 760 గ్రాముల బరువున్న బంగారు కలశం, బంగారు కొబ్బరికాయతో పాటు వజ్రాలు, కెంపులు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో బంగారు కలశం కూడా ఉన్నట్లు సీసీ కెమెరా రికార్డును బట్టి పోలీసులు గుర్తించారు. వ్యాపారవేత్త సుధీర్ జైన్‌కు చెందిన ఈ వస్తువులను జైన సంప్రదాయ పూజల్లో ఎంతో కీలకమైనవిగా భావిస్తారు. ఈ ఘటనపై సుధీర్ జైన్ మాట్లాడుతూ “భక్తుల రద్దీని ఆసరాగా చేసుకొని నిందితుడు దొంగతనానికి పాల్పడ్డాడు. ఆ వస్తువుల విలువ కంటే వాటితో మాకున్న అనుబంధం చాలా గొప్పది. వీటితోనే మా మనోభావాలు ముడిపడి ఉన్నాయి. వాటికి వెలకట్టలేం. పోలీసులు మా వస్తువులను త్వరగా రికవరి చేయాల్సిందిగా కోరుతున్నాం” అంటూ వేడుకున్నారు.


