Google allows real money games : గూగుల్ ప్లే స్టోర్‌లో మీకు ఇష్టమైన యాప్స్ అన్నీ దొరుకుతాయి… కానీ డబ్బు పెట్టి ఆడే ‘రియల్ మనీ గేమ్స్’ (RMG)కు మాత్రం మార్గం మూసుకుపోయి ఉండేది. ఈ విధానంపై ఎన్నో ఏళ్లుగా విమర్శలు, వివాదాలు నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ మెట్టు దిగింది. ఇకపై ప్లే స్టోర్‌లో రియల్ మనీ గేమ్స్‌ను అనుమతించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇంతకీ గూగుల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీని వెనుక ఉన్న కథేంటి..? ఈ కొత్త విధానం ఎలా ఉండనుంది..?
సీసీఐ ఎదుట గూగుల్ కీలక ప్రతిపాదనలు : భారత గేమింగ్ కంపెనీ ‘విన్‌జో’ చేసిన ఫిర్యాదుతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చేపట్టిన దర్యాప్తులో గూగుల్ కీలక ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. తమ ప్లే స్టోర్‌లో ‘రియల్ మనీ గేమ్స్’ (RMG) యాప్స్‌ను అనుమతించడానికి, వాటి ప్రకటనలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నామని సీసీఐకి నివేదించింది.
అందరికీ సమాన అవకాశం: ఇప్పటివరకు కేవలం రమ్మీ, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి ఎంపిక చేసిన యాప్స్‌ను మాత్రమే ‘పైలట్ ప్రోగ్రాం’ కింద అనుమతిస్తున్న గూగుల్, ఇకపై ఆ విధానాన్ని పూర్తిగా మార్చనుంది. చట్టబద్ధంగా పనిచేసే అన్ని రకాల రియల్ మనీ గేమ్స్ యాప్స్‌కు ఎలాంటి వివక్ష లేకుండా ప్లే స్టోర్‌లో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ప్రకటనలకూ ఓకే: నైపుణ్యం ఆధారిత గేమింగ్‌కు (Skill-based Games) సంబంధించిన ప్రకటనలను కూడా అనుమతిస్తామని గూగుల్ తెలిపింది. అయితే ఇందుకు ఓ షరతు విధించింది. ప్రభుత్వ నియంత్రణ సంస్థల ప్రమాణాలను పాటిస్తున్నట్లు థర్డ్ పార్టీ ధృవీకరణ పొందిన యాప్స్‌కు చెందిన యాడ్స్‌ను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది.
పారదర్శక నిబంధనలు: ఏ ఒక్క డెవలపర్‌కు, యాప్‌కు అనుకూలంగా తమ విధానాలు ఉండవని గూగుల్ తేల్చిచెప్పింది. గూగుల్ ప్లే వేదికగా జరిగే అన్ని చెల్లింపులకు, నిబంధనలకు ఒకే రకమైన పారదర్శక ప్రమాణాలు వర్తిస్తాయని హామీ ఇచ్చింది.
ప్రజాభిప్రాయ సేకరణ.. విన్‌జో ఆచితూచి స్పందన: గూగుల్ చేసిన ఈ ప్రతిపాదనలపై ప్రజలు, ఇతర సంస్థలు తమ అభిప్రాయాలను ఆగస్టు 20వ తేదీలోగా తెలియజేయవచ్చని సీసీఐ కోరింది. ఈ పరిణామంపై గూగుల్‌పై ఫిర్యాదు చేసిన ‘విన్‌జో’ కంపెనీ స్పందించింది.
వివాదాన్ని పరిష్కరించుకోవడానికి గూగుల్ ముందుకు రావడం శుభపరిణామమని విన్‌జో పేర్కొంది. అయితే, రియల్ మనీ గేమింగ్ యాప్స్ కోసం కొత్తగా ఓ ‘వాణిజ్య నమూనా’ను రూపొందిస్తున్నామని గూగుల్ చెబుతోందని, కానీ ఆ నమూనా ఎలా ఉంటుంది..? ఎప్పటిలోగా వస్తుంది..? అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదని విన్‌జో అభిప్రాయపడింది. గూగుల్ ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి, తమ తదుపరి వాదనలను సీసీఐ ముందు ఉంచుతామని తెలిపింది.


