Indira Gandhi Prize for Peace 2025 : స్వాతంత్ర్య సమరయోధురాలిగా ప్రస్థానం మొదలుపెట్టి, అంతర్జాతీయ మానవతావాదిగా ఎదిగిన ఆఫ్రికన్ ధీరవనితకు, భారత్ ప్రతిష్ఠాత్మక పురస్కారంతో పట్టం కట్టింది. 2025 సంవత్సరానికి గాను ‘ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి’ని మొజాంబిక్‌కు చెందిన ప్రముఖ హక్కుల కార్యకర్త, రాజకీయవేత్త గ్రేసా మెషెల్‌కు ప్రదానం చేస్తున్నట్లు అంతర్జాతీయ జ్యూరీ బుధవారం ప్రకటించింది.
మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ జ్యూరీ, 2025 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి గ్రేసా మెషెల్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. కఠినమైన పరిస్థితులలో సైతం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె చేసిన మార్గదర్శక కృషికి ఈ పురస్కారం దక్కింది.
ఎవరీ గ్రేసా మెషెల్? ఓ స్ఫూర్తిదాయక ప్రస్థానం : గ్రేసా మెషెల్ జీవితం, పోరాటాలు, విజయాలతో నిండిన ఓ స్ఫూర్తి గాథ.
సమరయోధురాలిగా..: 1945లో మొజాంబిక్‌లోని ఓ గ్రామీణ ప్రాంతంలో జన్మించిన ఆమె, లిస్బన్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడే స్వాతంత్ర్య భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. 1973లో స్వదేశానికి తిరిగి వచ్చి, ‘మొజాంబికన్ లిబరేషన్ ఫ్రంట్’ (FRELIMO)లో స్వాతంత్ర్య సమరయోధురాలిగా, ఉపాధ్యాయురాలిగా చేరారు.
తొలి విద్యాశాఖ మంత్రిగా: 1975లో మొజాంబిక్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, దేశ మొట్టమొదటి విద్యా, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె హయాంలో, పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం అద్భుతంగా పెరిగింది (పురుషులు 40% నుంచి 90%కి, మహిళలు 75%కి).
అంతర్జాతీయ వేదికపై : 1990లలో, మెషెల్ అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేశారు.
యుద్ధ బాధితుల కోసం..: సాయుధ ఘర్షణల వల్ల పిల్లలపై పడుతున్న ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఐక్యరాజ్యసమితి ఆమెను నియమించింది. ఆమె 1996లో సమర్పించిన నివేదిక, యుద్ధ ప్రాంతాలలో ఐరాస పనితీరును సమూలంగా మార్చేసింది.
అనేక పురస్కారాలు: ఆమె సేవలకు గుర్తింపుగా, ఐరాస ‘నాన్సెన్ రెఫ్యూజీ అవార్డు’, బ్రిటన్ ‘డేమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్’ వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. ‘ది ఎల్డర్స్’ (The Elders) సంస్థ వ్యవస్థాపక సభ్యురాలిగా, ‘గర్ల్స్ నాట్ బ్రైడ్స్’ (Girls Not Brides) ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె సొంత సంస్థ ‘గ్రేసా మెషెల్ ట్రస్ట్’ ద్వారా మహిళా సాధికారత, ఆహార భద్రత, సుపరిపాలన కోసం కృషి చేస్తున్నారు. ఈ అసాధారణ సేవలకు గుర్తింపుగానే, ఆమెకు ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు.

