గ్రేటర్ నోయిడాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 36 ప్రాంతంలో ఓ ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్ సీటు అకస్మాత్తుగా పేలిపోయింది. ఫ్లష్ బటన్ నొక్కగానే బాత్రూమ్‌లో పెద్ద శబ్దం తో పేలింది. ఈ ఘటనలో అషు నాగర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి శరీరానికి 35 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
ఈ ఘటన జరిగిన వెంటనే అషును సమీపంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)కి తరలించారు. అతడి తండ్రి సునీల్ ప్రధాన్ చెబుతున్న ప్రకారం, అషు ముఖం, చేతులు, కాళ్లు బాగా కాలిపోయాయి. ట్రీట్‌మెంట్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ పేలుడు ఎలా జరిగిందన్నది ఇంకా స్పష్టంగా తేలలేదు. బాత్రూమ్‌లో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడలేదు, మొబైల్ కూడా ఉపయోగించలేదు. అయినప్పటికీ మంటలు ఎలా చెలరేగాయో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమిక దర్యాప్తులో ఈ ప్రమాదానికి కారణం మీథేన్ గ్యాస్ అని అనుమానిస్తున్నారు. టాయిలెట్ లైన్‌లు బాగా శుభ్రం చేయకపోవడం, మురుగు నిలిచిపోవడం వల్ల బౌల్‌లో గ్యాస్ పేరుకుపోయి, చిన్న చిన్కు స్పార్క్‌తో పేలిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఆ కాలనీలోని డ్రైనేజీ లైన్లు చాలా కాలంగా శుభ్రం చేయలేదట. పైపులు పాతవే కావడంతో అందులో నుంచి గ్యాస్ లీకై, టాయిలెట్ బౌల్‌లో చేరి పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇక స్థానిక అధికారులు ప్రాథమిక విచారణలో ఇది ఇంట్లోని అంతర్గత సమస్య కావచ్చని చెబుతున్నారు. టాయిలెట్ వ్యవస్థ బయటికి సంబంధం లేకుండా పనిచేస్తోందని.. ఎలాంటి పైప్‌లైన్ లోపాలు కనపడలేదని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత స్థానికులు గ్యాస్ పేరుకునే అవకాశమున్న బాత్రూమ్ వ్యవస్థలపై అప్రమత్తంగా ఉండాలని, డ్రైనేజీ లైన్లను తరచూ శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.


