Noida Harrasment Murder Case : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక భయంకరమైన సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కేవలం కట్నం కోసం ఒక మహిళను ఆమె భర్తతో పాటు అత్తింటి సభ్యులు సజీవదహనం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలు 30 ఏళ్ల నిక్కీ. ఆమె ప్రాణాలను హరించిన విధానం, కారణాలు, ఆ సమయంలో ఉన్న చిన్నారికి ఎదురైన దృశ్యం అందరినీ కలచివేస్తున్నాయి.
లైటర్‌తో నిప్పంటించారని…
నిక్కీ ఆరేళ్ల కుమారుడు చూసిన దృశ్యాలను పోలీసులు, స్థానికులకు వివరించాడు. తన తల్లి మీద ద్రావణం పోసి, చెంపపై కొట్టి, ఆ తర్వాత లైటర్‌తో నిప్పంటించారని ఆ చిన్నారి చెప్పిన మాటలు విచారణలో కీలక సాక్ష్యాలుగా మారాయి. ఈ ముక్కుసూటి వివరణ దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
కట్నం కోసం ఒత్తిడి..
వివరాల ప్రకారం, నిక్కీకి వివాహం అయినప్పటి నుంచి భర్త విపిన్‌తో పాటు అత్తింటివారు తరచూ కట్నం కోసం ఒత్తిడి చేస్తూ వచ్చారు. మొదటగా స్కార్పియో కారు కోసం ఒత్తిడి తెచ్చి, ఆ తర్వాత బుల్లెట్ మోటార్‌సైకిల్ అడిగారు. నిక్కీ తండ్రి కూతురి కోసం ఈ కోరికలను తీర్చాడు. అయినప్పటికీ వారి కోరికలు తీరలేదు. ఇటీవల నిక్కీ తండ్రి కొనుగోలు చేసిన మెర్సిడెస్ కారుపై వారి దృష్టి పడింది. దానిని కూడా తమకే ఇవ్వాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.
కిరోసిన్ వంటి ద్రవాన్ని…
కుటుంబం ఆ ఖరీదైన కారును ఇవ్వలేకపోవడంతో విపిన్, అతని తల్లి, తండ్రి, మరికొందరు కలసి నిక్కీపై దాడి చేశారు. జుట్టు పట్టుకుని ఇంటి బయటికి ఈడ్చుకొని వెళ్లి ఆమె శరీరంపై కిరోసిన్ వంటి ద్రవాన్ని పోసి నిప్పంటించారు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు ఆరేళ్ల చిన్నారి, అలాగే నిక్కీ సోదరి కాంచన్ అక్కడే ఉన్నారు. ఆ ఘోర దృశ్యాన్ని వారు ప్రత్యక్షంగా చూశారు.
కాంచన్ తరువాత పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం, నిక్కీ సోదరిని రూ.36 లక్షల కట్నం ఇవ్వలేదన్న కారణంతోనే భర్త, అత్తింటివారు కలిసి సజీవదహనం చేశారని ఆరోపించారు. బాధితురాలి తండ్రి తన కోపం, ఆవేదనను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ తమ కుటుంబం ఇప్పటి వరకు అత్తింటివారు కోరిన ప్రతిదీ ఇచ్చిందని, అయినప్పటికీ కూతురి ప్రాణం తీసారని వాపోయారు. అంతే కాకుండా యోగి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి క్రూరులకు చోటు లేదని, వీరిని వెంటనే కఠినంగా శిక్షించాలని అన్నారు. ముఖ్యంగా నిందితులపై ఎన్‌కౌంటర్ జరిపి, వారి ఆస్తులపై బుల్డోజర్ నడపాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
Also Read: https://teluguprabha.net/national-news/greater-noida-dowry-murder-wife-burned-alive-shocking-case/
ఇదిలా ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భర్త విపిన్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు అత్త, మామ, నిక్కీ సోదరి భర్తపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం మిగతా నిందితులను పట్టుకోవడానికి గాలింపు కొనసాగుతోంది.


