EuroMillions lottery : అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరు చెప్పలేరు. ఓ గ్రామంలో నివసిస్తున్న 165 మంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయారు. అప్పటి వరకు సాధారణ జీవితాన్నే గడుపుతున్న వారికి లాటరీ రూపంలో అదృష్టదేవత తలుపు తట్టింది. దీంతో క్రిస్మస్ ముందే వచ్చింది అంటూ వారంతా పండగ చేసుకున్నారు. కొంచెం సినిమాటిక్‌గా అనిపించినా ఇది నిజంగా నిజం.
ఉత్తర బెల్జియంలోని ఓల్మెన్ అనే చిన్న గ్రామం ఉంది. 2020 లెక్కల ప్రకారం ఆ గ్రామంలో 3,785 మంది నివిసిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన 165 మంది తలా కొంత మొత్తం వేసుకుని యూరో మిలియన్ లాటరీని కొనుగోలు చేశారు.
తాజాగా ఈ లాటరీ డ్రాను తీశారు. అంతే వీరికి జాక్‌పాట్ తగిలింది. రూ.1200 కోట్ల ప్రైజ్‌మనీ వీరి సొంతమైంది. పన్నులు పోనూ ఒక్కొక్కరికి రూ.7.50 కోట్లు వచ్చాయి. దీంతో ఈ 165 మంది ఆనందంతో గెంతులువేశారు. ఈ ఏడాది ఇదే అద్భుతమైన క్రిస్మస్ గిఫ్ట్ అంటూ వీరి సంతోషంలో మునిగితేలుతున్నారు. నేషనల్ లాటరీ ప్రతినిధి జోక్ వెర్మోరే మాట్లాడుతూ.. ఒకేసారి ఇంత మంది లాటరీ గెలవలడం ఇదే తొలిసారి అని అన్నారు.