GST: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు పదిన్నర గంటలపాటు సుధీర్ఘంగా చర్చించిన అనంతరం నిర్మలా సీతారామన్ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ప్రకటించారు. దసర, దీపావళి పండుగల సందర్భంగా భారీ దమాకా ప్రకటించారు. దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యే తొలి రోజైన సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమలవుతాయని ఆమె ప్రకటించారు. నాలుగు శ్లాబుల్లో ఉన్న జీఎస్టీ ఇకపై 5శాతం, 18శాతాల్లో కొనసాగనుంది. గతంలో ఉన్న 12, 28 శాతాల శ్లాబులను ఎత్తివేస్తూ, వాటి పన్ను రేట్లను 5శాతం, 18శాతం శ్లాబుల్లో కలిపారు. ఈ నేపథ్యంలో కొత్త జీఎస్టీ విధానం వల్ల సామాన్య ప్రజలకు ఎంత మేరకు మేలు చేస్తుందో ఒక్కసారి గమనిస్తే…
ప్రాథమిక విద్యకు ఊరట
మ్యాపులు, చార్టులు, గ్లోబ్‌లు, పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, క్రేయాన్లు, ప్యాస్టెల్స్, ఎక్సర్‌సైజ్ పుస్తకాలు, నోటు బుక్కులు మొదలైనవాటిపై 12శాతం జీఎస్టీ వసూలు చేసేవారు. ఇప్పుడు అది 5శాతానికి తగ్గింది. ఎరేజర్‌పై 5శాతం జీఎస్టీ ఉండగా ఇప్పుడు అది పూర్తిగా రద్దు కానుంది.
ALSO READ: https://teluguprabha.net/national-news/union-cabinet-meeting-gst-farmer-relief-decisions-expected/
అగ్రికల్చర్
ట్రాక్టర్లు, ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, ప్రత్యేకించిన ఎరువులు, మైక్రోన్యూట్రియంట్లు, డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం), స్ప్రింకర్లు, వ్యవసాయ పరికరాలు మొదలైనవాటిపై 18శాతం, 12శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడు వాటిపై 5శాతం మాత్రమే వసూలు చేస్తారు.
టీవీలపై..
ఏసీలు, టీవీలు (32 ఇంచులకు పైబడినవి), మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషీన్లపై 28శాతం జీఎస్టీ ఉండగా దాన్ని 18శాతానికి తగ్గించారు.
బీమాకు ధీమా
ఆరోగ్య బీమా, జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దయింది. ఇకపై ఎలాంటి జీఎస్టీ వసూలు చేయరు. వైద్యుల సలహామేరకు వాడే కళ్లద్దాలపై ఉన్న 12శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించారు.
డైలీ వాడే వస్తువులపై..
హెయిర్ ఆయిల్ (తల నూనె), సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్‌లు, షేవింగ్ క్రీమ్, సైకిళ్లు, టేబుళ్లు, కుర్చీలు, పాస్తా, నూడుల్స్, కాఫీ, కార్న్‌ఫ్లేక్స్, బటర్, నెయ్యి వంటివాటిపై 18శాతం, 12శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడది అన్నింటి మీద 5శాతమే విధించనున్నారు.
తగ్గనున్న 350 సీసీలోపు బైక్‌ల ధరలు
కొత్త జీఎస్టీ విధానంలో 350సీసీలోపు మోటారు సైకిళ్ల ధరలు తగ్గుతాయి. వీటిపై 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్, కేటీఎం వంటి 350సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం బైక్‌ల ధరలు మాత్రం పెరుగుతాయి.
దుస్తులు, పాదరక్షలపై..
దుస్తులపై కాస్త జీఎస్టీ భారం పడనుంది.
రూ.2,500కు మించిన దుస్తుల ఉత్పత్తులపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. రూ.2500 లోపు ఉన్న ఉత్పత్తులపై 5శాతమే జీఎస్టీ విధించనున్నారు.
హానీకర వస్తువులు భారమే
హానీకర వస్తువులైన పాన్ మసాలాలు, సిగరెట్లు, గుట్కాలు, ఇతర పొగాకు ఉత్పత్తులతోపాటు శీతల పానీయాలు, చక్కెర, ఇతర తీపి పదార్థాలు, కెఫీన్ కలిపిన పానీయాలపై 40శాతం మేర జీఎస్టీ విధించనున్నారు.
ఇక పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలు, వాటి విడిభాగాలపై జీఎస్టీ తగ్గింపుతో కార్లతోపాటు ఆటోలు, బస్సులు, ట్రక్కుల ధరలు తగ్గుతాయి. లగ్జరీ వాహనాలపై అదనపు సెస్‌ను ఎత్తివేయనున్నారు. దీంతో వాటి ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై ఎప్పటిలాగే 5శాతం పన్నువిధించనున్నారు.
సింగరేణి, ‘బొగ్గు’విద్యుత్‌పై ఇలా
బొగ్గు, బొగ్గు ఆధారిత ఇంధనాలపై ప్రస్తుతమున్న 5శాతం జీఎస్టీని 18శాతానికి పెంచారు. దీని వల్ల బొగ్గు ధరలు పెరుగనున్నాయి. బొగ్గును వినియోగించే థర్మల్ విద్యుత్ కేంద్రాలపై తీవ్ర భారం పడి..విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగనుంది.
కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి అమలు చేయనున్న జీఎస్టీ పన్నుల విధానం



