Ghost patient : దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం కొంచెం కష్టమే. ఎందుకంటే కొందరు ఉన్నాయని చెబుతుంటే మరికొందరు మాత్రం వాటిని కొట్టిపడేస్తుంటారు. ఈ సంగతి కాసేపు పక్కన బెడితే అప్పుడప్పుడు ప్రపంచంలో కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఓ ఘటననే అర్జెంటీనాలో జరిగింది. చదవడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఓ సెక్యూరిటీ గార్డు ఘోస్ట్‌తో మాట్లాడడంతో పాటు దాని వివరాలు తీసుకున్నాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. దీంతో దెయ్యాలు ఉన్నాయా..? అనే ప్రశ్న చర్చనీయాంశమైంది.
అసలు ఆ వీడియోలో ఏముందంటే బ్యూనస్ ఎయిర్స్‌లోని ఫినోచియాటో శానిటోరియం అనే ప్రైవేట్ కేర్ సెంటర్‌లో ఓ సెక్యూరిటీ గార్డు రాత్రి పూట విధుల్లో ఉన్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్కడ ఎవరూ లేరు. అతను ఒక్కడే ఉన్నాడు. ఆస్పత్రి గ్లాస్ డోర్ ఓపెన్ అయ్యింది. వెంటనే తన కుర్చీలోంచి లేచిన సెక్యూరిటీ గార్డు నో ఎంట్రీ రోప్‌ను తీశాడు. అనంతరం ఆస్పత్రి రిజిస్టర్‌లో ఎవరో పేషంట్ వచ్చినట్లుగా వివరాలు నమోదు చేశాడు. అంతేకాదండోయ్ ఆ దెయ్యంతో కాసేపు ముచ్చటించాడు. ఆ తరువాత దానికి ఓ కుర్చీ వేసి తిరిగి వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదు అయ్యింది. ఈ వీడియో వైరల్‌గా మారగా.. ఇది చూసిన చాలా మంది షాక్‌కు గురి అవుతున్నారు. అతడికి నిజంగా దెయ్యం కనిపించిందా..? లేక కావాలనే అతడు అలా చేశాడా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.